Abn logo
Apr 11 2021 @ 14:44PM

బుల్లెట్లకు బ్యాలెట్‌తో సమాధానమిస్తాం: మమత

కోల్‌కతా: బెంగాల్‌లో ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓడిపోతామని కేంద్రంలోని బీజేపీకి తెలుసునని, అందుకునే వాళ్లు తుపాకులు తీస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆ బుల్లెట్లకు బ్యాలెట్‌ ద్వారా తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. జల్‌పాయ్‌గురిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, తానొక 'రాయల్ టైగర్'నని, తనను కూచ్ బెహర్ వెళ్లకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలతో జల్‌పాయ్‌గురి నుంచే తాను వీడియో కాల్‌లో మాట్లాడాడని తెలిపారు. 'నేను ఈనెల 14న మిమ్మల్ని కలుస్తాను' అని వీడియో కాల్‌లో మృతుల కుటుంబ సభ్యులకు సీఎం భరోసా ఇచ్చారు.

సత్తా లేని ప్రధాని, హోం మంత్రి

ప్రధానికి, హోం మంత్రికి పాలించే సత్తా లేదని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను కైవసం చేసుకునేందుకు ప్రతిరోజూ వాళ్లు వచ్చిపోతున్నారని చెప్పారు. 'మీరు రావచ్చు. ఎవరూ మిమ్మల్ని ఆపరు. కానీ మీరు ప్రజలు సంతోషంగా ఉండేలా చేయండి, కానీ బెదిరించొద్దు. కేంద్ర బలగాలతో ప్రజలను చంపుతున్నారు, ఆ తర్వాత బలగాలకు క్లీన్ చిట్ ఇస్తున్నారు' అంటూ బీజేపీ కేంద్ర నేతలపై మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూచ్ బెహర్ ఘటనను 'సామూహిక హత్యాకాండ'గా సీఎం అభివర్ణించారు. వాళ్లు బుల్లెట్లు విచ్చలవిడిగా కాల్చారని, కాళ్లపై, శరీరంలోని దిగువభాగంపై కాల్పులు జరిపి ఉండొచ్చని, కానీ బుల్లెట్లు ప్రజల మెడల్లోకి, ఛాతీల్లోకి వెళ్లిపోయాయని మమత వివరించారు.

Advertisement
Advertisement