పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , First Publish Date - 2021-01-24T09:01:10+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో 2021-2026 సంవత్సరాలకు(ఐదేళ్లు) గాను కొత్త ఐటీ పాలసీని తేనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉపాధి అవకాశాలను

పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యం

ఐటీ శాఖను బలోపేతం చేస్తాం: కేటీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో 2021-2026 సంవత్సరాలకు(ఐదేళ్లు) గాను కొత్త ఐటీ పాలసీని తేనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఐటీ పాలసీ గడిచిన ఐదేళ్ళలో అద్భుతమైన ఫలితాలను అందించిందని పేర్కొన్నారు. ఈ పాలసీకి ఐదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా  మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఐటీ శాఖ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రజలు మరిన్ని సేవలను పొందేలా ఎలక్ర్టానిక్‌ సర్వీస్‌ విభాగాన్ని బలోపేతం చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా ఆన్‌లైన్‌, మొబైల్‌ ప్రభుత్వ సేవలు విస్తృతం చేస్తామని చెప్పారు. 


ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించామని తెలిపారు. ఏ పాలసీ అయినా సరే.. పౌరుల కేంద్రంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలన్నీ కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐటీ శాఖను మరింత బలోపేతం చేస్తూ.. పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఐటీ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలపైనా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ ఈకో సిస్టమ్‌ బలపడిందని, దీనిని గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించాలని, విద్యార్థులను ఇన్నోవేటర్‌లుగా మార్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే కంపెనీలను ప్రోత్సహించామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారానూ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఎలక్ర్టానిక్స్‌ తయారీ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా యని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T09:01:10+05:30 IST