Abn logo
Sep 17 2021 @ 23:59PM

త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం

అక్కన్నపేటలో కస్తూర్భా విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

 ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ కుమార్‌


అక్కన్నపేట, సెప్టెంబరు 17: అక్కన్నపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గౌరవెల్లి రిజర్వాయర్‌ పెండింగ్‌ భూ సేకరణ పూర్తి చేసేందుకు రూ.53 కోట్లు జిల్లా కలెక్టర్‌ ఖాతాకు జమ చేశామని, త్వరలోనే ప్రాజెక్టు పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి రూ.3.50 కోట్లతో చేపట్టిన కూస్తూర్భా బాలికల విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదికను ప్రారంభించారు. మండలంలోని గండిపల్లి, రేగొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండల కేంద్రంలో ప్రభుత్వ సమీకృత భవనాల నిర్మాణాలకు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మైసమ్మవాగుతండాకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మి-బీలునాయక్‌, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు పాల్గొన్నారు.