ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం..

ABN , First Publish Date - 2022-08-16T07:07:36+05:30 IST

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం..
పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా వందనం చేస్తున్న మంత్రి గంగుల

 

- అన్నదాతలకు రూ. 177.67 కోట్ల రైతుబంధు సహాయం

- చేనేత కార్మికులకు సరికొత్త బీమా పథకం 

- రూ. 150 కోట్లతో మెడికల్‌ కాలేజీ మంజూరు

- స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 


 రైతుబంధు ద్వారా 1,81,725 మందికి లబ్ధి


రైతుబంధు పథకం ద్వారా ఇంతవరకు 1,81,725 మంది రైతులకు 177 కోట్ల 67 లక్షల రూపాయలను ఖాతాల్లో జమ చేశామని అన్నారు. 456 మంది రైతులు మరణించగా 401 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 20 కోట్ల 5 లక్షల రూపాయలను నామినీ ఖాతాల్లో జమ చేశామన్నారు. వరిధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, యాసంగి సీజనల్‌ 337  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 3 లక్షల 27 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 178 మిల్లులకు పంపించామని అన్నారు. 2 కోట్ల 60 లక్షల సబ్సిడీతో 6,297 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించామని, 73,682 టన్నుల వివిధ రకాల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పాం పంటను ప్రభుత్వం ప్రోత్సహిసోందని తెలిపారు. 


 94,874 వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్‌


జిల్లాలో 94,874 వ్యవసాయ బావులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, దీనికి ప్రభుత్వం 100 కోట్లకుపైగా సబ్సిడీ భరిస్తుందని అన్నారు. లక్ష్మీపూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌లో సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వివిధ ప్రాంతాల్లో తొమ్మిది అదనపు సబ్‌ స్టేషన్లు, 92 మరో సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌ పంపిణీ లైన్లను బలోపేతం చేసేందుకు లైన్లను ఏర్పాటు చేశామని, సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు 49 కోట్ల రూపాయలతో కొత్త సబ్‌ స్టేషన్ల ఏర్పాటు, ఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరందించేందుకు ప్రభుత్వం 1,492 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో 22 కట్టడాలు, 1,232 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. 


 దళిత బంధుతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు


దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం దళితబంధు పథకం కింద కుటుంబానికి స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 17,840 కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున 1,766 కోట్ల 16 లక్షల రూపాయలు జమ చేశామని తెలిపారు. హుజూరాబాద్‌లో 15,373 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్‌ చేశామని, 213 మందికి వ్యవసాయ సంబంధ యూనిట్లు అందించామన్నారు. 2,415 డెయిరీ యూనిట్లు, 8,356 ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 130 మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, 1937 రిటైల్‌ షాపులు, 2,322 సర్వీస్‌ సబ్‌ప్లస్‌ యూనిట్లను అందించామన్నారు. చేనేత కార్మికుల నూలు, రసాయనాల కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. నేతన్న బీమా పథకం కింద కార్మికులు చనిపోతే నామినీకి 5 లక్షల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ అందిస్తున్నామని, 19 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 3 కోట్ల 47 లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11,173 టన్నుల చేపల ఉత్పిత్త లక్ష్యంకాగా 6,037 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయని, 466 టన్నుల రొయ్యల ఉత్పత్తికిగాను 255 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల వారసులకు ఐదు లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం చెందినవారికి లక్ష రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం కింద 13,439 మంది లబ్ధిదారులను గుర్తించి 3,586 మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. హుజూరాబాద్‌లో నాలుగు మండలాల్లో 1623 మందికి 6,492 పాడి గేదెలను అందజేశామని తెలిపారు. 


 సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు


డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. హరితహారం కింద 2 కోట్ల 76 లక్షల మొక్కలు నాటామని, జిల్లాలో 47.8 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం ఆశయ సాధనలో భాగంగా 150 కోట్లతో మెడికల్‌ కాలేజీ మంజూరయ్యిందని చెప్పారు. 100 మెడికల్‌ సీట్లతో తరగతులు నిర్వహించేలా జనరల్‌ ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. 19,26,260 మందికి కొవిడ్‌ టీకా ఇచ్చామని, మంకీ పాక్స్‌ వ్యాధి నివారణ ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌  వేగంగా కొనసాగుతుందన్నారు. ఆగస్టు నుంచి ఆహార భద్రత కార్డులకు యూనిట్‌కు 15 కిలోలు, అంత్యోదయ ఆహార భద్రత కార్డులకు 35 కిలోలతోపాటు 10 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 19 లక్షల 23 వేల పనిదినాలు కల్పించామన్నారు. బ్యాంకు లింకేజీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 695 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 160 కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు. స్ర్తీనిధి ద్వారా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు 500 సోలార్‌ విద్యుత్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించామని, జిల్లాలో 1,15,995 మందికి ఆసరా పించన్లను మంజూరు చేసి ప్రతి నెల లబ్దిదారులకు చెల్లిస్తున్నామన్నారు. 


 జిల్లాలో కొత్తగా 31,882 మందికి ఆసరా పింఛన్లు


ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 57 సంవత్సరాలు దాటిన అర్హులైన మరో 9,46,117 మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. జిల్లాలో కొత్తగా 57 సంవత్సరాలు దాటిన 31,822 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశామని, పంపిణీ చేస్తామన్నారు. ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ పథకం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 770 మంది నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చామన్నారు. డైరెక్ట్‌ ప్లేస్‌మెంట్‌ కింద జిల్లాలో ఇప్పటి వరకు 674 మందికి వివిధ ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 26 మంది శిక్షణలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం పథకం కింద 6,494 ఇళ్లను మంజూరు చేసిందని, 4,907 ఇళ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్‌ చేసుకున్నామన్నారు. ఇంతవరకు 789 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల నిర్మాణ  పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.


 రోడ్ల అభివృద్ధికి రూ. 225 కోట్లు


 జిల్లాలో సింగిల్‌ లైన్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం జిల్లాకు 225 కోట్లు మంజూరు చేసిందని, పనులన్నీ ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి సడక్‌ యోజన పథకం కింద 30 కోట్ల 89 లక్షల రూపాయలతో 12 తారు రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. మినరల్‌ ఫండ్‌ ద్వారా 2,040 వివిధ రోడ్ల అభివృద్ధి పనులకు 160 కోట్ల 97 లక్షలు మంజూరు చేశామని, అందులో 1,616 పనులు పూర్తయ్యాయని తెలిపారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా 520 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీ నిర్మాణం, స్టాం వాటర్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు మంజూరు చేశామని తెలిపారు. తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఎల్‌ఎండీ దిగువన 410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు. 

Updated Date - 2022-08-16T07:07:36+05:30 IST