విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తాం

ABN , First Publish Date - 2022-07-02T05:18:12+05:30 IST

చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషనత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని డీఈవో రమే్‌షకుమర్‌ తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తాం
పాఠశాలలో మిషన్‌ భగీరథ వాటర్‌ను పరిశీలిస్తున్న డీఈవో

వారి ఆరోగ్యం మెరుగయ్యే వరకు డిశ్చార్జి చేయం

భోజనం వికటించిన ఘటనపై  డీఈవో రమేశ్‌కుమార్‌ విచారణ

సూరారం ఉన్నత పాఠశాల పరిసరాల పరిశీలన

హెచ్‌ఎం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం

విద్యార్థుల నుంచి నోట్‌బుక్కుల కోసం డబ్బు వసూలు చేసినందుకు చర్యలు


చిన్నశంకరంపేట, జూలై 1: చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషనత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని డీఈవో రమే్‌షకుమర్‌ తెలిపారు. డీఈవో రమేశ్‌కుమార్‌ శుక్రవారం సూరారం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురైతే ఎందుకు సమాచారం ఇవ్వలేదని హెచ్‌ఎం యాదగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజన నిత్యావసర వస్తువులను పరిశీలించారు. వంట నిర్వాహకులతో మాట్లాడి నాణ్యమైన వంట నూనె, సామగ్రి వాడాలని సూచించారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాతనే పిల్లలకు భోజనం పెట్టాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల నుంచి నోట్‌బుక్కుల కోసం డబ్బు వసూలు చేశారని తల్లిదండ్రులు డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. డబ్బు వసూలు చేసే అధికారం ఎవరిచ్చారంటూ హెచ్‌ఎంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించి ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన మంచినూనె, పప్పు దినుసులను వాడాలన్నారు. పాఠశాల స్థితిగతులపై హెచ్‌ఎం శివప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయబోమని, వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. వంట నిర్వాహకులను మార్చాలని గ్రామస్థులు తీర్మాణం చేశారు. ఆయన వెంట ఎంఈవో యాదగిరి, సీఆర్పీలు ఉన్నారు. 


 సూరారంలో మిషన్‌ భగీరథ  వాటర్‌ శాంపిల్‌ సేకరణ

సూరారం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థుల ఘటనతో శుక్రవారం మిషన్‌భగీరథ డీఈ శ్రీనివాస్‌, వాటర్‌ గ్రిడ్‌ అధికారులు పాఠశాలలోని వాటర్‌ ట్యాంకులను,  గ్రామంలోని ట్యాంకులను పరిశీలించి నీటిని సేకరించారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు వాటర్‌ తాగి అస్వస్థతకు గురైనట్లు వార్తలు రావడంతో గ్రామాన్ని సందర్శించి నీటిని సేకరించినట్లు చెప్పారు. ఆ నీటిని ల్యాబ్‌లో టెస్టు చేస్తామని చెప్పారు. మిషన్‌ భగీరథ నీరు ఫిల్టర్‌ అవుతుందని, ప్రతి ఒక్కరూ అవే వాటర్‌ను తాగాలని ఆయన కోరారు. ఆయన వెంట వాటర్‌ గ్రిడ్‌ అధికారులు తిరుమలేష్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ నిఖిల ఉన్నారు. 

Updated Date - 2022-07-02T05:18:12+05:30 IST