బీసీల హక్కులను కాపాడతాం

ABN , First Publish Date - 2021-10-29T05:44:12+05:30 IST

బీసీలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి హక్కులను కాపాడడమే తమ లక్ష్యమని రాష్ట్ర అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు, విధాన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.

బీసీల హక్కులను కాపాడతాం
కమిటీ సభ్యులతో దేవస్థానం అధికారులు

రాష్ట్ర అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి

సింహాచలం, అక్టోబరు 28: బీసీలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి హక్కులను కాపాడడమే తమ లక్ష్యమని రాష్ట్ర అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు, విధాన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన వారందరికీ అండగా ఉంటామన్నారు. కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి గురువారం సింహాద్రి అప్పన్న స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరంట ఆయన మీడియతో మాట్లాడుతూ బీసీలను సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా బీసీ కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ పర్యటనలో పలువురు ఈ డిమాండ్‌తో వినతులు అందిస్తున్నారన్నారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలలో శాశ్వత, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విభాగాల్లోని ఖాళీల వివరాలు, వాటి భర్తీ, రోష్టర్‌ విధానం అమలు వంటి అంశాలపై తమ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తోందన్నారు. ఇప్పటివరకు కడప, చిత్తూరు, నెల్లూరు, జిల్లాల్లో పర్యటించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో సమీక్ష నిర్వహించామన్నారు. టీటీడీలో రజకులకు జరుగుతున్న నష్టాన్ని తాము గుర్తించామని, యాంత్రీకరణ పేరుతో కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రజకులకు నష్టం కలుగుతోందన్నారు. యంత్రాల నిర్వహణలో రజకులను వినియోగించడం ద్వారా వారిని ఆదుకోవాలని టీటీడీ అధికారులకు సూచించామన్నారు. కాగా కమిటీ సభ్యులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆహ్వానం పలకగా వారి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. అధికారులు శాలువతో చైర్మన్‌ను సత్కరించి సభ్యులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. 


Updated Date - 2021-10-29T05:44:12+05:30 IST