కబ్జా చేసి అద్దెకు ఇస్తాం

ABN , First Publish Date - 2022-08-08T05:35:28+05:30 IST

ప్రభుత్వం స్థలం కనిపిస్తే కబ్జా చేసేయడమే. ఆపై అక్కడ బడ్డీలను ఏర్పాటు చేస్తారు. అద్దెకిస్తామని బోర్డులు పెట్టేస్తారు. చిన్న వ్యాపారులకు ఇచ్చేసి ప్రతినెలా జేబులు నింపుకుంటారు.

కబ్జా చేసి అద్దెకు ఇస్తాం
మండల పరిషత్‌ కార్యాలయ స్థలంలో ఏర్పాటు చేసిన బడ్డీలు

 రాజాంలో వైసీపీ నేతల తీరిది
ఖాళీ ప్రభుత్వ స్థలాలే టార్గెట్‌
మిన్నకుండి పోతున్న అధికారులు


ప్రభుత్వం స్థలం కనిపిస్తే కబ్జా చేసేయడమే. ఆపై అక్కడ బడ్డీలను ఏర్పాటు చేస్తారు. అద్దెకిస్తామని బోర్డులు పెట్టేస్తారు. చిన్న వ్యాపారులకు ఇచ్చేసి ప్రతినెలా జేబులు నింపుకుంటారు. చివరకు ఫుట్‌పాత్‌ను కూడా వదిలి పెట్టడం లేదు. ఇవన్నీ అధికారులకు తెలుసు. అయినా మిన్నకుండి పోతున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు వెనుకాడుతున్నారు. కారణం.. వారంతా అధికారపార్టీ నాయకులు కావడమే.

రాజాం, ఆగస్టు 7: అది రాజాం మండల పరిషత్‌ కార్యాలయ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలం. ఖాళీగా  ఉండడంతో దోసరి రామినాయుడువలస గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుని కన్ను పడింది. అంతే.. వేరే దగ్గరున్న తన బడ్డీలను ఈ స్థలంలోకి తీసుకొచ్చి పెట్టడమే కాకుండా అద్దెకు ఇస్తామని టులెట్‌ స్టిక్కరు అంటించారు. ఈస్థలం విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. రాజాంలో కబ్జా పర్వాలకు పరాకాష్ట ఇది. కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ఖాళీ భూములపై పడుతున్నారు. వివిధ మార్గాల్లో వాటిని చేజెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఖాళీగా ఉన్న చోటును గుర్తించి ఆ తర్వాత ఆక్రమించి సొంతం చేసుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. అధికారులు తెలిసినా మౌనం వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు గనుక వారి విషయంలో చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న ఆ బడ్డీలను అక్కడ ఖాళీ చేసి మండల పరిషత్‌ స్థలంలో ఏర్పాటు చేసేశారు. అయితే తాము స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి కాకుండా ఏకంగా అద్దెలకు ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు.


రాజాంలో గజాల స్థలాలకు సైతం అద్దెలు అధికంగా ఉంటున్నాయి. దీంతో కొందరు వ్యక్తులు ఫుట్‌పాత్‌లనూ వదలడం లేదు. దర్జాగా ఆక్రమించి అద్దెలకు ఇస్తున్నారు. ప్రశ్నిస్తే పెద్ద నాయకుల పేర్లు చెబుతున్నారు. పశువుల ఆసుపత్రి ఆవరణతో పాటు నూతనంగా నిర్మాణం చేపట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ పాత భవనం స్థలాలు కూడా ఇప్పటికే ఆక్రమణలో ఉన్నాయి. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తుంటే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తాయిలాలకు అలవాటు పడ్డారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.  ఆఖరుకు కోర్టు సముదాయంలో కూడా ఆయా వ్యక్తులు బడ్డీలు ఏర్పాటు చేసేశారు. దీనిపై కోర్టు అధికారులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఆక్రమణలను ఇటీవల తొలగించారు.

 అంతకాపల్లి గ్రామానికి చెందిన మరో వైసీపీ ముఖ్య నాయకుడు ఎంపీడీవో కార్యాలయ స్థలంలో ఇప్పటికే దుకాణాలు ఏర్పాటు చేశాడు. ఆ స్థలాన్ని మూడేళ్లు పాటు లీజుకు తీసుకొని పెద్ద దుకాణం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మిగిలిన నాయకులకు ఆ స్థలంపై మక్కువ పెరిగింది. ఏదో రకంగా చేజెక్కించుకోవాలని చూస్తున్నారు.

 కొండంపేట గ్రామానికి చెందిన ఇంకో వైసీపీ నాయకుడు రాజాంలోని కొత్త చెరువును పూడ్చి ఆ చెరువులో కొంత స్థలాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారుల సహకారంతో అమ్మకాలు చేపట్టి కోట్లాది రూపాయలు ఆర్జించారని ఆ గ్రామస్థులే చెబుతున్నారు. అంతే కాకుండా కొంతమందికి చెందిన జిరాయితీ భూములు కూడా ఆయన పేరున మార్పించి స్వాధీనం చేసుకున్నాడని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగిన న్యాయం చేయాలని ఆ గ్రామస్థులు స్పందనలో సైతం ఫిర్యాదు చేశారు.

ఎవరైనా సరే వదిలిపెట్టం
మండల పరిషత్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలు ఆక్రమించుకొని అద్దెలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటాం. ఎప్పుడు తొలగించాలని చెబితే అప్పుడు తీసేస్తామని చెప్పారు. కబ్జా చేయాలని చూస్తే ఎవరైనా సరే వదిలిపెట్టం. బడ్డీలను తొలగిస్తాం.
                - బాసూరు శంకరరావు, ఎంపీడీవో, రాజాం


Updated Date - 2022-08-08T05:35:28+05:30 IST