మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తదితరులు
టీడీపీ నేతల వెల్లడి
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, జూలై 2 : ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించే వరకూ ఉద్యమిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు విలేఖర్లతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పర్యాయాలు ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. డీజిల్ సెస్ పేరిట ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచుతూ ప్రయాణికులపై పెనుభారం మోపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిందన్నారు. ప్రతి నెలా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల కోట్ల వరకూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సర్కారు తీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, గుంట్రెడ్డి రవికుమార్, జాగాన రవిశంకర్, గర్భాపు ఉదయభాను, కౌన్సిలర్ బి.గౌరునాయుడు, పి.శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు.