చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తాం

ABN , First Publish Date - 2021-05-09T08:48:46+05:30 IST

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు

చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తాం

నేడు దర్యాప్తు అధికారి హైదరాబాద్‌కు: కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప


కర్నూలు, మే 8: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. కర్నూలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో చంద్రబాబుపై నమోదైన కేసు గురించి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త రకం కరోనా కర్నూలులోనే పుట్టిందని సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. బి.1.136 రకం కరోనాను సీసీఎంబీ గత ఏడాది జూన్‌లోనే గుర్తించిందన్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైర్‌సపై క్లారిటీ ఇచ్చిందని అన్నారు. ఎన్‌ 440 కే స్టెయిన్‌కు సంబంధించిన కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఈ రకం ప్రయోగశాలల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, బయటి వాతావరణంలో అంతగా వ్యాప్తి చెందదని శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. దీని వల్ల ప్రజలు, చిన్నారులు, యువత చనిపోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రకం స్టెయిన్‌ కర్నూలులో ఎక్కువగా ఉన్నట్లు చంద్రబాబు భయాందోళనలకు గురి చేశారని సీనియర్‌ న్యాయవాది సుబ్బయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం కింద 2005 కింద కేసు నమోదు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చేందుకు వన్‌టౌన్‌ సీఐ ఆదివారం హైదరాబాదుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దీనిని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-05-09T08:48:46+05:30 IST