Abn logo
Sep 21 2021 @ 00:12AM

‘అసెంబ్లీని ముట్టడిస్తాం’

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 20: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ప్రారంభించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెల్ఫేర్‌ బోర్డు నిధులు రూ.380 కోట్లు ఏ విధంగా వాడుకున్నదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నవరత్నాల పేరుతో కార్మికుల నిధులు వాడుకోవడం దుర్మార్గమన్నారు. అంజిబాబు, సుధాకరప్ప, రాముడు, జాఫర్‌, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: బిల్డింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రాముడు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం నిలిపివేసిన బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రెవిన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, ఉస్మాన్‌వలి, మధు, శ్రీనివాసులు, రామన్న, వీరేంద్ర, రాజు, వెంకటేశ్వర్తు, వీరేష్‌ పాల్గొన్నారు. 


కోడుమూరు: ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు గఫూర్‌మియ్య డిమాండ్‌ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గఫూర్‌మియ్య మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం నిల్వ ఉంచిన వెల్ఫేర్‌ బోర్డులోని వందల కోట్ల రూపాయాలను ప్రభుత్వం వాడుకొందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి కార్మికుడికి రూ.10వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 
 ‘భూసేకరణను వేగవంతం చేయండి’ 


ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్‌, ఏపీఐఐసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, డీఆర్వో పుల్లయ్య, కర్నూలు, ఆదోని ఆర్డీవోలు హరిప్రసాద్‌, రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జడ్‌ఎం వెంకట నారాయణమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాజెక్టులు, ఏపీఐఐసీకి భూసేకరణ పెండింగ్‌ లేకుండా భూసేకరణ వేగవంతం చేయాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌, కర్నూలు, ఆదోని ఆర్డీవోలను ఆదేశించారు. ఏపీఐఐసీ, సోలార్‌ ప్రాజెక్టు, నేషనల్‌ హైవే చెన్నై సూరత్‌, ఆర్‌అండ్‌బీ, ఈఈ పబ్లిక్‌ ఎంఐ ఇరిగేషన్‌, కేసీ కెనాల్‌, రైల్వే తదితర శాఖలకు భూసేకరణ సంబందిత అధికారులు వేగవంతం చేయాలని అన్నారు.