Abn logo
Sep 22 2021 @ 00:55AM

తెన్నేటి స్ఫూర్తితో ఉద్యమం ఉధృతం చేస్తాం

తెన్నేటి విశ్వనాథం జయంతి సభలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 21:  తెన్నేటి విశ్వనాథం స్ఫూర్తితో ఉక్కు  పోరాటాన్ని ఉధృతం చేసి విజయాన్ని సాధిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 222వ రోజు కొనసాగాయి.  మంగళవారం ఈ దీక్షలలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, క్యూఏటీడీ, డీఎన్‌డబ్ల్యూడీ అండ్‌ ఈఆర్‌ఈ విభాగాల కార్మికులు కూర్చున్నారు. తొలుత తెన్నేటి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ శిబిరంలో అయోధ్యరామ్‌ మాట్లాడుతూ  తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెన్నేటి ఆద్వర్యంలో ఆనాడు జరిగిన ఉద్యమం నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. 

  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ గతంలో విశాఖ ఉక్కు కర్మాగారంపై అడుగడుగునా కుట్రలు, ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు తిప్పికొట్టారన్నారు. 1985లో రేషనలైజ్డ్‌ కాన్సెప్ట్‌ పేరుతో ప్లాంట్‌ను ముక్కలు చేసే ప్రయత్నాలు చేశారని, 1998లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంట్‌లను ప్రైవేట్‌కు ఇచ్చే ప్రయత్నాలు చేసారని, 1400 ఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ భూమిని లాక్కొని గంగవరం పోర్టుకు అప్పగించారని, 1999లో బీఐఎఫ్‌ఆర్‌ పేరుతో అమ్మేయాలనే ప్రయత్నం చేశారని వివరించారు.   విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, ఎన్‌.రామారావు, వైటీ దాస్‌, గంధం వెంకటరావు, సత్యనారాయణ, మస్తానప్ప, పైడిరాజు, అప్పారావు, జగదీశ్‌, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.