రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తాం

ABN , First Publish Date - 2022-05-27T05:23:57+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేయడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు.

రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తాం
జహీరాబాద్‌ మండలం రాయిపల్లి (డి)లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న గీతారెడ్డి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి


జహీరాబాద్‌, మే 26 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేయడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. గురువారం జహీరాబాద్‌ మండలం రాయిపల్లి (డి)లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వరంగల్‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై రైతులకు గీతారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోరేది కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని గీతారెడ్డి పేర్కొన్నారు. మోసపూరితమైన హామీలను ఇచ్చే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయకూడదని ఆమె కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. రైతు డిక్లరేషన్‌లో సూచించిన అన్ని వాగ్ధానాలను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చడం ఖాయమని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో ప్రకటించిన తొమ్మిది పథకాలను అమలు చేస్తామన్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ  రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ. 15,000, మరియు మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పోడు భూముల రైతులకు అసైస్ట్‌ భూముల లబ్ధిదారులకు క్రియ విక్రయాలతో సహా అన్ని యజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు.  ధరణి పోర్టల్‌ రద్దు చేసి దాని స్థానంలో రక్షణ కల్పించేలా, అందరి భూములకు సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:23:57+05:30 IST