మీ కాళ్లు పట్టుకుంటాం..మా ఇళ్లు కూల్చొద్దు సార్‌

ABN , First Publish Date - 2022-08-19T08:32:47+05:30 IST

‘మీ కాళ్లు పట్టుకుంటాం సార్‌.. మా గృహాలు కూల్చొద్దు’ అంటూ ఓ వృద్ధురాలు తహసీల్దార్‌ను వేడుకుంది.

మీ కాళ్లు పట్టుకుంటాం..మా ఇళ్లు కూల్చొద్దు సార్‌

  • తహసీల్దార్‌ను వేడుకున్న వృద్ధురాలు
  • ‘పలాస’లో టీడీపీ నేతల ఆస్తులే టార్గెట్‌
  • వైసీపీ నేతల ఒత్తిళ్లతో కూల్చివేతకు యత్నం
  • అడ్డుకున్న స్థానికులు.. తీవ్ర ఉద్రిక్తత


పలాస, ఆగస్టు 18: ‘మీ కాళ్లు పట్టుకుంటాం సార్‌.. మా గృహాలు కూల్చొద్దు’ అంటూ ఓ వృద్ధురాలు తహసీల్దార్‌ను వేడుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 27వ వార్డు శ్రీనివాసనగర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులకు చెందిన ఆస్తులే టార్గెట్‌గా గురువారం రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. వారి ఆధీనంలో ప్రభుత్వ పోరంబోకు  భూములు స్వాధీనం చేసుకోగా, గృహాలు సైతం కూలగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన మాజీ వైస్‌చైర్మన్‌, 27వ వార్డు కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణకు చెందిన మొత్తం నాలుగు ఇళ్లను కూలగొట్టేందుకు యత్నించగా.. శ్రీనివాసనగర్‌ ప్రాంత ప్రజలు, టీడీపీ అభిమానులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలోని ఉల్లాసపేట చెరువు వద్ద ఆక్రమణలు తొలగించేందుకు తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, మునిసిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావు పోలీసు సిబ్బందితో చేరుకున్నారు. దీంతో స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. 


తమ గృహాలు కూల్చొద్దని వేడుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో జోగమ్మ అనే వృద్ధురాలు తహసీల్దార్‌ మధుసూదనరావు కాళ్లపై పడింది.  తామంతా పేదలమని, ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ నివాసముటున్నామని, తమ ఇళ్లు కూల్చొద్దని వేడుకుంది. ఇళ్లు కూల్చివేస్తే కట్టుబట్టలతో వీధినపడాల్సి వస్తుందని కన్నీరుమున్నీరైంది. దుర్గా అనే యువతి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు ఇస్తామని చెబుతూనే.. కూల్చివేతకు పాల్పడడం దారుణమని వాపోయింది. ఇదిలా ఉండగా.. చెరువు మొత్తం విస్తీర్ణం 1.10 ఎకరాలు కాగా, చుట్టూ 50 వరకు పేదల గృహాలు నిర్మించారు. 40ఏళ్ల నుంచి ఇక్కడ గృహాలు ఉండగా, 21 ఏళ్ల కిందట సూర్యనారాయణకు ప్రభుత్వం పట్టా ఇవ్వడంతో ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. అయితే, వైసీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ చర్యలకు పాల్పడడానికి యత్నించగా, హైకోర్టు ఆదేశాల మేరకు తాము చెరువు ఆక్రమణలు తొలగించడానికి వచ్చామని తహసీల్దార్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-19T08:32:47+05:30 IST