చేనేతకు చేయూతనిస్తాం

ABN , First Publish Date - 2022-08-08T08:05:48+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రకటించారు.

చేనేతకు చేయూతనిస్తాం

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ద్వారా వస్త్రాల కొనుగోలు 

నేతన్నల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత

నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం వెళ్లకపోవడం సరికాదు

పోచంపల్లి నేతన్నల సమ్మేళనంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సంజయ్‌

పోచంపల్లి నేతన్నల సమ్మేళనంలో బండి సంజయ్‌కుమార్‌ 


యాదాద్రి, భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రకటించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. ఐదో రోజైన ఆదివారం యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఆయన చేనేత కార్మికులతో సమ్మేళనం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేస్తామన్నారు. ఇళ్లు లేని పేద చేనేత కార్మికులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వినోబాభావే భూదానోద్యమం, వెదిరె రామచంద్రారెడ్డి భూదానం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. అరబ్‌ దేశాలకు రూ.8వేల కోట్ల విలువైన చేనేత వస్త్రాలను ఎగుమతి చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో చేనేత సంక్షోభం కారణంగా సుమారు 360 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నారని..


వారి కుటుంబాలకు సాయం చేయాల్సింది పోయి.. సీఎం కేసీఆర్‌ పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తున్నారని విమర్శించారు. ‘‘అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం కేసీఆర్‌ది. గత ఎన్నికల్లో 15 వేలు కనీస వేతనం, నూలు దారంపై సబ్సిడీ ఇస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 30 వేల మగ్గాలకు సబ్సిడీ ఇచ్చాడట.. జియో ట్యాగ్‌ పెట్టారట.. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు’’ అని విమర్శించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని బండి సంజయ్‌ అన్నారు. ‘‘ఎన్నికలొస్తే ఓట్ల కోసం అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు గుర్తుకొస్తరు. దండేసి దండం పెట్టి హామీలిస్తడు. ఎన్నికలు కాగానే ఆ హామీలను గాలికొదిలేసే నయవంచక అవకాశవాది కేసీఆర్‌’’ అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సిగ్గు లేకుండా నీతి అయోగ్‌ను విమర్శిస్తున్నారని, సమస్య ఉంటే నీతిఅయోగ్‌ సమావేశానికి వెళ్లి.. వివరించి, పరిష్కారం కోసం ఆలోచించాలన్నారు. కాగా.. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌కు చెందిన 20 మంది చిన్ననాటి స్నేహితులు సంజయ్‌ని కలిశారు. .


జోరు వానలో.. జనం హోరులో.. 

బండి సంజయ్‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఐదో రోజైన ఆదివారం జోరు వానలో కొనసాగింది. భూదాన్‌పోచంపల్లి పట్టణ పరిధిలోని ముక్తాపూర్‌, చింతబావి, రేవణపల్లి, భూదాన్‌పోచంపల్లి, భీమనపల్లి, మీదుగా జిబ్లక్‌పల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కలిసి విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.


9న గుండ్రాంపల్లిలో జెండాలతో ర్యాలీ

75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 13న తెలంగాణలోని ప్రతి కార్యకర్త ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరేయాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జులతో సంజయ్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఈనెల 9న క్విట్‌ ఇండియా దినాన్ని పురస్కరించుకుని మునుగోడులోని గుండ్రాంపల్లిలో భారీ జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించనున్నట్లు సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - 2022-08-08T08:05:48+05:30 IST