మా ఊరెళ్లిపోతాం!

ABN , First Publish Date - 2022-01-22T06:40:12+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసతుల కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఒకపక్క ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ఇంతవరకు మొదలెట్టలేదు. స్పిల్‌వే సుమారుగా పూర్తయింది.

మా ఊరెళ్లిపోతాం!
జనం లేకపోవడంతో పాడుబడుతున్న దేవీపట్నం గ్రామం

  • ఇక్కడెలా బతకం.. ఇళ్లు ఇవ్వలేదు.. పరిహారం లేదు
  • పునరావాస కాలనీల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన
  • తిరిగి ముంపు గ్రామాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న బాధితులు
  • ఈనెలాఖరు వరకూ అధికారులకు గడువిచ్చిన దేవీపట్నం ప్రజలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిర్వాసతుల కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఒకపక్క ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ఇంతవరకు మొదలెట్టలేదు. స్పిల్‌వే సుమారుగా పూర్తయింది. కానీ ఇంకా కొన్ని గేట్లు అమర్చాలి. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను పూర్తిచేసి, ఇప్పటికే అక్కడ కొంత నీటిని నిల్వ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్టు ఏ స్థాయిలో కదులుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నిధులు కొరత. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన రూ.320 కోట్లు తిరిగివెళ్లిపోయాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టు సంగతి ఎలా ఉన్నా పోలవరం ముంపు గ్రామాల నుంచి బయటకు వచ్చిన వారికి ఇంకా రావలసిన సౌకర్యాలు ఇవ్వలేదు. కొందరికి పునరావాస కాలనీలు నిర్మించారు. కానీ వారికి మనిషి ఒక్కరికి రూ.6.66 లక్షల వంతున రావలసిన సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు. భూమికి భూమి ఇవ్వలేదు. అటు దేవీపట్నం, మడుపల్లి, కె.వీర వరం తదితర గ్రామాలను గత జూన్‌లోనే ఖాళీ చేయించారు. కానీ ఇంతవరకూ వాళ్లకు కాలనీలు నిర్మించలేదు. పరిహారమూ పూర్తిగా ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలు మాత్రం ఇచ్చారు. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పైగా అక్కడ పట్టాలు ఇవ్వడానికి సేకరించిన భూమి యజమానికి సైతం ఇంకా డబ్బు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో నిర్వాసితులంతా, ఏజెన్సీలోని మిగతా ప్రాంతాల్లోనూ, గోకవరం వంటి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించిన అఽధికారులు కనీసం వాళ్లకు ఇళ్ల సౌకర్యం కూడా కల్పించలేదు. ఒక్కో కుటుంబం రూ.3 వేల నుంచి అయిదు వేల వరకు అద్దె ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. అక్కడ అడవిని, పొలాలను వదిలిరావడంతో వారికి జీవనోపాధి కూడా లేదు. పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజల పరిస్థితీ దయనీయంగా ఉంది. పనులు లేక పస్తులు ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారంతా మళ్లీ తమ గ్రామాలకు వెళ్లి ఏదొక విధంగా బతుకుదామనే నిర్ణయానికి వచ్చారు. దేవీపట్నం, మడుపల్లి గ్రామ ప్రజలు ఇప్పటికే రెవెన్యూ అధికార్లకు ఈ విషయం చెప్పారు. ఈనేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజామణి ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెంలో నిరశన దీక్ష కొనసాగిస్తుండగా, 33వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఈ శిబిరానికి దేవీపట్నం, గోకవరం తహశీల్దార్లు వచ్చి ఎవరూ కంగారు పడకండి, కలెక్టర్‌ మీకు హామీ ఇచ్చారు కదా అని చెప్పారు. దీంతో నిర్వాసితులు మాట్లాడుతూ ఇటీవల మొదలెట్టినట్టు మొదలెట్టి, పనులు ఆపేసిన ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు, ఎందుకు మా బతుకులతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకూ ఆగుతాం, ఈలోగా పరిహారం ఇచ్చి, ఇళ్లను చూపించకపోతే తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోతామని దేవీపట్నం, పూడుపల్లికి చెందిన నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు. వాస్తవానికి దేవీపట్నం మండలంలో పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలు 44. అందులో 18 గ్రామాలకు పునరావాసం కల్పించి అధికారులు ఖాళీ చేయించారు. కానీ వారికి కూడా ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించలేదు. కొండమొదలు ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు అధికారుల మాట బేఖాతర్‌ చేశారు. తమకు అన్ని పరిహారంతోపాటు భూమికి భూమి ఇచ్చి, కాలనీలు నిర్మించిన తర్వాతే వస్తామని ఖరాఖండీగా చెప్పారు. మిగతా గ్రామాలను మాత్రం నయోనో భయానో ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఎంత దారుణమంటే గత ఏడాది జూన్‌ తర్వాత వరద సమయంలో వరదతో ఊళ్లన్నీ మునిగిపోతే కనీస వరద సహాయం  కూడా చేయలేదు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కావడం 32 మీటర్ల ఎత్తువరకూ వరద నీరు రావడంతో ఊళ్లన్నీ వరద గోదావరిగా మారిపోయాయి. దీంతో చాలామంది ఊళ్లు ఖాళీ చేశారు. ఇక ప్రభుత్వ అధికారులు ఎవరినీ తిరిగి గ్రామాలకు వెళ్లనీయలేదు. దీనితో దిక్కులేని బతుకు బతుకుతున్నారు. ఇంతవరకూ పరిహారం అందకపోవడం, పునరావాస కాలనీలు కూడా పూర్తి కాకపోవడంతో, అసలు ఈ ప్రాజెక్టు పరిస్థితి అర్థంకాక, తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒక గ్రామం కదిలిందంటే మిగతా వారు కూడా కదిలే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలవరం కథ మళ్లీ మొదటికి వస్తుందేమోననే అనుమానం ఉంది.

Updated Date - 2022-01-22T06:40:12+05:30 IST