MCD ఎన్నికల కోసం కోర్టుకు వెళ్తాం: Kejriwal

ABN , First Publish Date - 2022-07-05T23:24:50+05:30 IST

ల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని ..

MCD ఎన్నికల కోసం కోర్టుకు వెళ్తాం: Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) అన్నారు. అసెంబ్లీలో మంగళవారంనాడు ఆయన మాట్లాడుతూ, ఎంసీడీ ఎన్నికలు గడువులోగా నిర్వహించాలన్నారు. లేదంటే కోర్టుకు వెళ్లి తీరుతామని పరోక్షంగా కేంద్రానికి సంకేతాలు ఇచ్చారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తమ శక్తియుక్తులతో ఎన్నికలను జరగనీయడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీని పూర్తి కేంద్ర పాలిత ప్రాంతం చేసి, ఎన్నికలు లేకుండా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.


అసెంబ్లీ సమావేశానంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, మూడు ఎంసీడీల విలీనం కసరత్తు సమయంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. ఎంసీడీల విలీనం జరిగి ఏడాదిన్నర గడిచినప్పటికీ డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ''ఎన్నికలు జరపడం వారికి ఇష్టం లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. దీనిపై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం'' అని చెప్పారు.


మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుపై మాట్లాడుతూ, ఆయన అరెస్టు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని, మెుహల్లా క్లినిక్ కాన్సెప్ట్‌ను దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే మొదటిసారి తీసుకు వచ్చిన వ్యక్తి సత్యేంద్ర జైన్ అని చెప్పారు. ఆయనను (జైన్) వాళ్లు (కేంద్రం) జైలుకు పంపించినప్పటికీ  ప్రజలు మాత్రం కేంద్రాన్ని విశ్వసించడం లేదని, జైన్ నిజాయితీపరుడని బలంగా చెబుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2022-07-05T23:24:50+05:30 IST