బిల్లులు చెల్లిస్తేనే పల్లెప్రగతి పనులు చేస్తాం

ABN , First Publish Date - 2022-05-29T05:09:40+05:30 IST

లక్షల రూపాయలు అప్పు తెచ్చి పల్లెప్రగతి పనులు చేస్తే, బిల్లులు మంజూరు కాకపోవడంతో వడ్డీ చెల్లించలేక పోతున్నామని, పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తేనే పల్లెప్రగతి పనులను చేస్తామని సర్పంచులు తెగేసి చెప్పారు.

బిల్లులు చెల్లిస్తేనే పల్లెప్రగతి పనులు చేస్తాం
ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేస్తున్న సర్పంచులు

మండల సర్పంచుల ఏకగ్రీవ తీర్మానం

కొల్చారం, మే 28: లక్షల రూపాయలు అప్పు తెచ్చి పల్లెప్రగతి పనులు చేస్తే, బిల్లులు మంజూరు కాకపోవడంతో వడ్డీ చెల్లించలేక పోతున్నామని, పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తేనే పల్లెప్రగతి పనులను చేస్తామని సర్పంచులు తెగేసి చెప్పారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో పల్లెప్రగతి సమీక్షా సమావేశాన్ని ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా చేస్తున్న పల్లె ప్రగతి పనులకు బిల్లులు రాలేదన్నారు. అప్పులు తెచ్చి పనులు చేశామని, వాటి వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చెల్లించేందుకు వ్యవసాయ పొలాలను అమ్ముకున్నామన్నారు. ప్రభుత్వం సూచించిన అభివృద్ధి పనులు చేసిన బిల్లులు ఎందుకు రావని ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు విష్ణువర్దన్‌ రెడ్డి, సర్పంచ్‌లు వీరారెడ్డి, రామ్‌రెడ్డి, ఇందిర, ప్రియదర్శిని, రమేష్‌, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:09:40+05:30 IST