Abn logo
Sep 22 2021 @ 23:33PM

కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

రేకుర్తి వద్ద అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- అన్ని డివిజన్లలో 24/7 మంచినీటి సరఫరా 

- మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 22: కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం 18, 19 డివిజన్ల పరిధిలో కోటి 63 లక్షలతో చేపట్టనున్న మంచినీటి పైపులైను, జంక్షన్‌ రోడ్‌, కాకతీయ కాల్వపై కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కోటి 39 లక్షలతో మంచినీటి పైపులైను, 19 లక్షలతో జంక్షన్‌ రోడ్‌, ఐదు లక్షలతో కాకతీయ కాల్వ కల్వర్ట్‌ పనులను ప్రారంభించామన్నారు. వెంటనే పనులు మొదలుపెట్టి నాణ్యాతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామని, ఇందులో భాగంగానే మంచినీటి పైపులైన్లు వేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రేకుర్తి ప్రజలకు మంచినీటిని అందిస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో విలీనగ్రామాలతోపాటు నగరంలోని 60 డివిజన్లలో 24/7 నిరంతర మంచినీటిని సరఫరా చేస్తామని, ఇందుకోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ యాదగిరిరావు,డివిజన్ల కార్పొరేటర్లు ఏదుళ్ళ రాజశేఖర్‌, సుధగోని మాధవికృష్ణగౌడ్‌, పలువురు కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. 


 తెలంగాణ ఆడబిడ్డలే మన ఆస్తి


హుజూరాబాద్‌: తెలంగాణ ఆడబిడ్డలే మన ఆస్తి అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ  ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు మద్దతివ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో.. ఓట్ల కోసం వచ్చే వారిని అడగాలన్నారు. కరోనా సంక్షోభంలో ప్రతి ఒక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం, 1500 రూపాయలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.