రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2021-11-28T04:21:30+05:30 IST

నారాయణపేట జిల్లాలో 104 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు.

రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు పూర్తి చేస్తాం
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన

కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, నవంబరు 27 : నారాయణపేట జిల్లాలో 104 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వరిధాన్యం కొనుగోలు, యాసంగిలో పంటల సాగుపై డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీ, వ్యవసాయ అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా గ్రాము ఉప్పుడు బియ్యం సైతం కొనబోమని స్పష్టం చేసిందని, యాసంగిలో రైతులు ఎవరూ వరి పండించకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్లను కోరారు. వానాకాలం వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, జిల్లాల్లో అవసరమైన కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడా ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సివిల్‌ సప్లై అధికారులు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి మౌళిక సదుపాయాలు, రవాణ, గన్నీ బ్యాగులు, గోదాముల సమస్య లేకుండా సంబంధిత శాఖల ద్వారా సమన్వయం చేసుకోవాలన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండి మధ్యవ ర్తుల ద్వారా వచ్చే ధాన్యాన్ని అరికట్టాలని సూచించారు.  నారాయణపేట జిల్లా ఇతర రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున జిల్లా పోలీస్‌ శాఖతో కలిసి బయ టి నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో ఎస్పీ చేతన పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T04:21:30+05:30 IST