రెండున్నరేళ్లు ఉంటాం, వచ్చేసారి 200 సీట్లు గెలుస్తాం: Eknath Shinde

ABN , First Publish Date - 2022-07-05T01:32:23+05:30 IST

రాబోయే రెండున్నరేళ్లు తమ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి..

రెండున్నరేళ్లు ఉంటాం, వచ్చేసారి 200 సీట్లు గెలుస్తాం: Eknath Shinde

ముంబై: రాబోయే రెండున్నరేళ్లు తమ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించిన ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం కుప్పకూలుతుందని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ చెప్పడాన్ని ఆయన కొట్టిపడేశారు. పవార్ పెద్ద నేత అని, అయితే ఆయన చెప్పింది మాత్రం వాస్తవ విరుద్ధమని అన్నారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు. తమకు అనూకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్తుకు మద్దతుగా ఉంటారని చెప్పారు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 100 మంది ఎమ్మెల్యేలు, తమ వైపు నుంచి 100 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని, మొత్తం 200 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


'వ్యాట్' తగ్గిస్తాం...

మహారాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ త్వరలోనే పెట్రోలియంపై వ్యాట్ తగ్గిస్తామని షిండే భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి వేగవంతమవుతుదంని, దేవేంద్ర ఫడ్నవిస్ అనుభవం ద్వారా మహారాష్ట్ర తప్పనిసరిగా లబ్ధి పొందుతుందని అన్నారు. గత ప్రభుత్వాల సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం తాను చూశానని, పెండింగ్ పనులు పూర్తయ్యేలా చేశారని అన్నారు. ఈ ప్రభుత్వంలో కూడా మెట్రో ప్రాజెక్ట్, సమృద్ధి మహామార్గ్ సహా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ''మేము 50 మంది (శివసేన), బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా నిర్ణయాలు తీసుకుంటాం'' అని షిండే చెప్పారు.

Updated Date - 2022-07-05T01:32:23+05:30 IST