రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. 317 జీవోను సవరిస్తాం

ABN , First Publish Date - 2022-01-12T07:52:39+05:30 IST

‘‘ఉపాధ్యాయులు, ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవొద్దు.

రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. 317 జీవోను సవరిస్తాం

  • ఉపాధ్యాయులు, ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవొద్దు.. 
  • కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాం
  • బీజేపీకి భయపడే కమ్యూనిస్టులతో దోస్తీ
  • కేసులకు భయపడేది లేదు.. ఉద్యమిస్తాం
  • మహబూబ్‌నగర్‌ సభలో బండి సంజయ్‌
  • ‘కాళేశ్వరం’లో అవినీతి లేదని యాదాద్రిలో ప్రమాణం చేస్తారా?
  • సీఎం కేసీఆర్‌కు డీకే అరుణ సవాల్‌
  • బీజేపీ నేతలపై వ్యాఖ్యలు జుగుప్సాకరం: ఈటల


మహబూబ్‌నగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘ఉపాధ్యాయులు, ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవొద్దు. ఆత్మహత్యల ఆలోచన చేయకం డి. రెండేళ్లలో మేం(బీజేపీ) అధికారంలోకి వస్తాం. 317 జీవోను సవరిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె లేకుండా తెలంగాణ ఉద్య మం విజయవంతమయ్యేదా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల అండదండల తో అందలమెక్కిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వారిని అణచివేతకుగురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా మంగళవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద వేస్ట్‌ఫెలో తీసుకువచ్చిన జీవో.. 317అన్నారు. భార్యాభర్తల్ని విడదీసి, సీనియర్‌-జూనియర్ల మధ్య చిచ్చుపెట్టిన ఈ జీవోకు వ్యతిరేకంగా త మ పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపిస్తామని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్‌ ఓ పెద్ద అవినీతి తిమింగలం. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారు. విచారణలకు భయపడి.. ముందస్తుగా ఈడీ/ఐటీ కేసులంటూ సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మెడలు వంచి, గడీల నుంచి బయటకు తీసుకువస్తాం’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ఉద్యమాలకు భయపడే కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. ‘‘తెలంగాణ వద్దన్న సీపీఎంతో జట్టుకట్టిన తెలంగాణ ద్రోహి కేసీఆర్‌. 


తెలంగాణ ద్రోహులతో సీఎం కుటుంబం చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను, టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీ అని.. ఇప్పుడు ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం తన కార్యాలయంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే.. దుర్మార్గంగా పోలీసులు దాడికి దిగారన్నారు. గేట్లను రంపాలతో, గ్యాస్‌ కట్టర్లతో కోశారని.. బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని గుర్తుచేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు భయపడేది లేదు. కేసులకు, లాఠీ దెబ్బలకు బీజేపీ కార్యకర్తలు బెదిరిపోరు. బండి సంజయ్‌కి కేసులు కొత్తకాదు. ఆ జీవోతో పోలీసులకు కూడా నష్టం వాటిల్లింది’’ అని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ తగ్గాక హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్‌ కంటే పెద్ద వైరస్‌ కేసీఆర్‌ అంటూ నిప్పులు చెరిగారు. పాలమూరుకు సీఎం కేసీఆర్‌ ద్రోహం చేశారని.. కృష్ణా జల్లాల్లో 500 టీఎంసీలకు బదులు.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి వచ్చారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ సవాల్‌ విసిరారు. 


317 జీవో కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయారని.. ఇంకా ఎంత మంది చనిపోతే జీవోను సవరిస్తారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీ సీఎంలను, జాతీయ నేతలను గేలి చేస్తున్న విధానం జుగుప్సాకరంగా ఉందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. దేశ చరిత్రలోనే సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బహుశా ఇదే మొదటి సారని.. అందుకు సీఎం కేసీఆర్‌ కారణమని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శ్రుతి, ప్రదీ్‌పకుమార్‌గౌడ్‌, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, రవీంద్రనాయక్‌, పి.చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-01-12T07:52:39+05:30 IST