హైకోర్టులో సవాలు చేస్తాం!

ABN , First Publish Date - 2020-10-01T08:44:19+05:30 IST

అయోధ్య రామజన్మభూమి వివాదంలో ప్రధాన పిటిషనర్‌ ఇక్బాల్‌ అన్సారీ తీర్పును స్వాగతించగా.. ముస్లింలు హైకోర్టులో సవాలు చేస్తారని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు జఫర్యాబ్‌ జిలానీ అన్నారు...

హైకోర్టులో సవాలు చేస్తాం!

  • ముస్లిం లా బోర్డు సభ్యుడు జిలానీ


లఖ్‌నవూ, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయోధ్య రామజన్మభూమి వివాదంలో ప్రధాన పిటిషనర్‌ ఇక్బాల్‌ అన్సారీ తీర్పును స్వాగతించగా.. ముస్లింలు హైకోర్టులో సవాలు చేస్తారని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు జఫర్యాబ్‌ జిలానీ అన్నారు. కోర్టు తీర్పును గౌరవించాల్సిందిగా ముస్లిం సమాజానికి అన్సారీ పిలుపునిచ్చారు. నిందితులు అక్కడి వేదికపై నిల్చుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఐపీఎస్‌ అధికారులు, జర్నలిస్టులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు పట్టించుకోలేదని జిలానీ వ్యాఖ్యానించారు. హైకోర్టులో సవాలు చేయాలా.. వద్దా.. అనే విషయాన్ని అన్ని ముస్లిం సంస్థలూ చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని ఏఐఎంపీఎల్‌బీ సీనియర్‌ సభ్యుడు మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫిరంగి మహలి అన్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌) ప్రకటించింది.


‘సుప్రీం’ వ్యాఖ్యలకు విరుద్ధం: జమాత్‌

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నవంబరు 9న రామజన్మభూమి తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉందని జమాత్‌ ఉలేమా-ఏ-హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ అన్నారు. బాబ్రీ విధ్వంసం పట్టపగలు జరిగిందని, దీనికి ప్రపంచమే సాక్ష్యమన్నారు. 


రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కాంగ్రెస్‌

సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని రాజ్యాంగంపై విశ్వాసం కలిగిన, మతసామరస్యం కోరుకునే ప్రతి భారతీయుడూ కేంద్రాన్ని కోరాలని రణ్‌దీప్‌ సూర్జేవాలా పిలుపునిచ్చారు. బాబ్రీ కేసు తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. 


క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారు: ఒవైసీ

బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందుత్వ వాదులను తృప్తి పరచడానికే ఈ తీర్పు ఇచ్చినట్లుందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా సీబీఐ కోర్టు విస్మరించడం దారుణమన్నారు. తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయడం ద్వారా సీబీఐ తన స్వతంత్రతను చాటుకోవాలని సూచించారు. నిందితులకు ఎలా క్లీన్‌ చిట్‌ ఇస్తారని ప్రశ్నించారు. తీర్పుపై అప్పీలు చేయాలని ముస్లిం పర్సనల్‌ లా బోర్డును కోరతానని చెప్పారు. 

Updated Date - 2020-10-01T08:44:19+05:30 IST