Abn logo
Sep 26 2021 @ 23:56PM

ఐదు వేల ఇళ్లు కట్టిస్తాం

రజకుల ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

- ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రజకులకు లోన్లు ఇప్పిస్తాం

- బీసీలను దగా చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పండి

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హుజూరాబాద్‌, సెప్టెంబరు 26: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కాగానే ఐదు వేల ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ, మొల్లమాంబ విగ్రహాలను మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజకుల కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌లో రజకుల ఆశీర్వాద సభలో హరీష్‌రావు మాట్లాడారు. రజకులకు ఈటల రాజేందర్‌ 18 ఏళ్లలో గుంట భూమి అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. రజకులకు బడ్జెట్‌లో 250 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తోందన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేస్తే ఇంత వరకు బీజేపీ పట్టించుకోలేదన్నారు. బీజేపీ ద్వారా హుజూరాబాద్‌ ప్రజలకు ఈటల రాజేందర్‌ ఏం చేస్తాడో చెప్పాలన్నారు. ఈటల రాజేందర్‌ మైక్‌లో మాట్లాడుతున్నాడంటే అది కేసీఆర్‌ వల్లనేనని గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ఫర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌, కొండపాక శ్రీనివాస్‌, సంపత్‌కుమార్‌, సాయికృష్ణ, తిరుపతి  పాల్గొన్నారు.

- కుమ్మరి కులస్థులకు ఎలక్ర్టికల్‌ సారెలు ఆందజేస్తాం

జమ్మికుంట రూరల్‌: కుమ్మరి కులస్థులకు ఎలక్ట్రికల్‌ సారెలు ఆందజేస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కుమ్మరి కులస్థుల ఆశీర్వాద సభకు హజరయ్యారు. అంతకు ముందు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్థానిక గాంధీ చౌరస్తాలో  కుమ్మరి కులస్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేదికపై హరీష్‌రావు సారెను తిప్పి కుండను తయారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుమ్మరి కులస్థులకు గుజరాత్‌ నుంచి ఎలక్ట్రికల్‌ సారెలు తెప్పించి ఇస్తామన్నారు. కుమ్మరులకు ప్రజాపతి జీవో తెప్పించి ఇచ్చే బాధ్యత తనదన్నారు. పెన్షన్‌, కరెంట్‌ సబ్సిడీ కావాలని అడుగుతున్నారని, సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళతానన్నారు.  ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాళ్లు మొక్కైనా హుజూరాబాద్‌ నియోజక వర్గానికి ఐదు వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు తీసుకు వస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటే నియోజక వర్గం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందన్నారు. సభకు తరలివస్తున్న కుమ్మరి కులస్థులను చూసి ఈటల రాజేందర్‌ ఆగం అవుతున్నాడని తెలిపారు. జమ్మికుంటలో శాలివాహన విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.  

- ఈటల ఎందుకు రాజీనామ చేశాడు..

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ఈటల రాజేందర్‌ తప్పు చేయడం వల్లే బర్తరఫ్‌ అయ్యారని, ఎమ్మెల్యే పదవికి ఎవరూ అడుగక ముందే రాజీనామా చేసి, మళ్లీ అదే పదవికి పోటీ పడుతున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరిన వ్యక్తి ఈటల అన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.