మేమొస్తే.. విలీన బడులను వెనక్కి తెస్తాం

ABN , First Publish Date - 2022-08-10T20:59:58+05:30 IST

టీడీపీ(TDP) అధికారంలోకి వస్తే విలీనం పేరుతో దూరంగా తీసుకెళ్లిన స్కూళ్లను వెనక్కి తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. చిన్న పిల్లలు కిలోమీటర్ల దూరం ఎలా నడుస్తారన్న కనీస జ్ఞానం లేకుండా..

మేమొస్తే.. విలీన బడులను వెనక్కి తెస్తాం

పిల్లలు అంత దూరమెలా నడుస్తారు?


అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ(TDP) అధికారంలోకి వస్తే విలీనం పేరుతో దూరంగా తీసుకెళ్లిన స్కూళ్ల(schools)ను వెనక్కి తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. చిన్న పిల్లలు కిలోమీటర్ల దూరం ఎలా నడుస్తారన్న కనీస జ్ఞానం లేకుండా.. అనేక తరగతులను దూరంగా ఉన్న స్కూళ్లకు తరలించారని, చివరకు గిరిజన ప్రాంతాల బడులను కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు రావాలని ఆ ప్రాంతంలోని ఉద్యోగాలు వారికే ప్రత్యేకిస్తూ ఎన్టీఆర్‌ హయాంలో జీవో నంబర్‌ మూడు ఇచ్చాం. దానిని కొట్టివేస్తే ఈ ప్రభుత్వం కోర్టులో గట్టిగా పోరాటం చేయలేకపోయింది. సొంత కేసులకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకునే ఈ ప్రభుత్వ పెద్దలు.. పేద గిరిజనులకు మేలు చేసే జీవో విషయంలో పట్టనట్లు వ్యవహరించారు. గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేధిస్తూ మేం జీవో ఇస్తే ఈ ప్రభుత్వం లేటరైట్‌ తవ్వకాలకు అనుమతి పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకు తెరతీసింది. రోజూ నాలుగైదు వందల లారీల ఖనిజాన్ని అక్రమంగా భారతీ సిమెంట్స్‌కు తరలిస్తోంది. అటవీ ప్రాంత గిరిజనులు, మైదాన ప్రాంత గిరిజనుల సంక్షేమానికి మేం 18 పథకాలు అమలు చేస్తే వాటన్నిటినీ నిలిపివేశారు. 

Updated Date - 2022-08-10T20:59:58+05:30 IST