విదేశీ గడ్డపైకెళ్లి కూడా పోరాడతాం

ABN , First Publish Date - 2020-10-27T06:59:01+05:30 IST

వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌తో ఘర్షణలకు దిగుతున్న చైనాకు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. భద్రతాపరంగా ముప్పుందని భావిస్తే -

విదేశీ గడ్డపైకెళ్లి కూడా పోరాడతాం

డోభాల్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 26: వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌తో ఘర్షణలకు దిగుతున్న చైనాకు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. భద్రతాపరంగా ముప్పుందని భావిస్తే - భారత భూభాగంపైనే కాకుండా విదేశీ గడ్డపైకి వెళ్లి మరీ పోరాడతామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ స్పష్టం చేశారు. ’భారత్‌ తనంత తానుగా ఏ దేశంపైనా దాడిచేయదు. సేనలు మోహరించిన చోటే పోరాడాలన్న నియమమేదీ లేదు. ముప్పుకు కేంద్ర స్థానమైన ప్రదేశానికి వెళ్లి మరీ యుద్ధం చేస్తాం. నవ భారతావని (న్యూ ఇండియా) సిద్ధాంతమిది’ అని ఆయన ప్రకటించారు.


రిషీకేశ్‌లో పరమత నికేతన్‌ ఆశ్రమంలో చేసిన ప్రసంగంలో ఆయన ఈ మాటలన్నారు. నాగరిక సమాజంలో విలువల గురించే ఆయన మాట్లాడారు తప్ప ఏ దేశాన్ని ఉద్దేశించి కాదని అధికార వర్గాలు అంటున్నప్పటికీ డోభాల్‌ మాత్రం చైనాతో పాటు పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


చైనాది విస్తరణ నైజం..

సైనిక సన్నద్ధతలో భారత్‌ చైనాను మించిపోవాలని, అన్ని విభాగాల్లో మరింత శక్తిమంతం కావాలని  భాగవత్‌- విజయదశమి సందర్భంగా ఏటా జరిపే ప్రసంగంలో పిలుపునిచ్చారు. ’ఈ మధ్య చైనా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. దీనికి మన సైన్యం, ప్రభుత్వం, ప్రజలు వేగంగా, పకడ్బందీగా స్పందించిన తీరు, మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన తీరును తిప్పికొట్టడం డ్రాగన్‌ను నివ్వెరపోయేట్లు చేసింది.


దీనిపై చైనా ఇకముందు ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి మనం చాలా జాగురూకతతో, పూర్తి సన్నద్ధంగా ఉండాలి.పొరుగు దేశాలతో బంధాన్ని పటిష్టం చేసుకోవాలి’ అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. ’అందరితో స్నేహంగా మసలే మనస్తత్వం మనది. అయితే దీన్ని ఓ బలహీనతగా భావించి, ఉక్కుపాదంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నా, బలహీనపరచాలనుకున్నా అందుకు సమ్మతించం’. మన శత్రు దేశాలు దీనిని ఇప్పటికే గ్రహించి ఉంటాయి’ అని భాగవత్‌సూటిగా పేర్కొనడం విశేషం. 


Updated Date - 2020-10-27T06:59:01+05:30 IST