‘భారతీయ విజ్ఞానాన్ని’ కొత్తగా చేరుస్తాం

ABN , First Publish Date - 2020-08-02T06:53:21+05:30 IST

కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భారతీయ విజ్ఞానం అనే అంశం కొత్తగా చేరనుంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ

‘భారతీయ విజ్ఞానాన్ని’ కొత్తగా చేరుస్తాం

  • ఎన్‌ఈపీతో కేవీల్లోనూ మాతృభాషలో బోధన
  • భాషోపాధ్యాయుల కొరతను అధిగమిస్తాం: రమేశ్‌ పోఖ్రియాల్


న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భారతీయ విజ్ఞానం అనే అంశం కొత్తగా చేరనుంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో కూడా మాతృభాషలో బోధన జరగనుంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో చదివేవారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉంటారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన విధానాన్ని అమలు చేస్తాం’’ అని వివరించారు. మాతృభాషలో బోధన నిర్ణయంలో ఇంగ్లి్‌షను తప్పించే ఉద్దేశం లేదన్నారు. దేశవ్యాప్తంగా భాషోపాధ్యాయుల కొరతను గురించి ఆయన ప్రస్తావిస్తూ.. రాష్ట్రాల సమన్వయంతో దీన్ని అధిగమిస్తామన్నారు. ఇందు కోసం 4 ఏళ్ల బీఈడీ కోర్సును పరిచయం చేస్తామన్నారు. భారతీయ విజ్ఞానం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రాచీన భారతం నుంచి ఆధునిక భారతం వరకు భారతీయ విజ్ఞానాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తాం. ఇందులో విద్య, వైద్యం, పర్యావరణ విజ్ఞానానికి సంబంధించిన అంశాలుంటాయి. శాస్త్రీయంగా వీటిని బోధనలో భాగం చేస్తాం’’ అని వివరించారు.


ప్రభుత్వ, ప్రైవేటు మధ్య మరింత అంతరం?

‘మాతృభాష’పై మేధావి వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో.. ఆ నిబంధన కేవలం సర్కారీ స్కూళ్లలోనే అమలయ్యే సూచనలున్నాయని చెబుతున్నారు. ప్రైవేటులో ఇంగ్లి్‌షకే ప్రాధాన్యత ఉంటుందని, దీంతో.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మధ్య అంతరం మరింత పెరిగే ప్రమాదముందంటున్నారు. సైన్స్‌, గణితం వంటి సబ్జెక్టుల్లో పుస్తకాలను మాతృభాషతోపాటు.. ఇంగ్లి్‌షలో అచ్చువేయించాలని చెబుతున్నారు. టీచర్లు రెండు భాషల్లో పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది టీచర్లకు ఇబ్బందికరమే. దేశంలో 22 గుర్తింపు పొందిన భాషలుండగా, వందల సంఖ్యలో గుర్తింపులేని భాషలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో విద్యార్థుల మాతృభాషను ఎలా నిర్ధారిస్తారు? అనేప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల్లో అధికార భాషను అమలు చేద్దామన్నా.. గిరిజన విద్యార్థులకు అది మాతృభాష కాదు. అలాంటి వారికి ఇంగ్లిష్‌ నేర్చుకోవడం ద్వారానే ప్రయోజనాలు ఎక్కువ అని విద్యావేత్తలు చెబుతున్నారు.


18 ఏళ్లు విద్యాహక్కుపై భిన్నాభిప్రాయాలు

ఎన్‌ఈపీలో పేర్కొన్నట్లు.. విద్యాహక్కు చట్టాన్ని(ఆర్టీఈ) 3 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు పెంచడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. పలువురు మేధావులు విభేదిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు ప్రైవేటు స్కూళ్లకు రూ.750 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌ బకాయి పడ్డాయని, దాన్ని 18 ఏళ్లకు పెంచితే, నాలుగు రెట్ల అదనపు భారం తప్పదని అంటున్నారు. ప్రస్తుతం ఈ చట్టం కింద 8వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్య తప్పనిసరి. ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాలయాల్లో 25% సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించాలి. అయితే.. ప్రైవేటు స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడంకంటే.. ఆ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చని సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-02T06:53:21+05:30 IST