‘దళితబంధు’ను స్వాగతిస్తున్నాం

ABN , First Publish Date - 2021-07-23T06:44:07+05:30 IST

దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం అన్నారు.

‘దళితబంధు’ను స్వాగతిస్తున్నాం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం

- పనికిమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలి

- ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం

సుభాష్‌నగర్‌, జూలై 22: దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం అన్నారు. గురువారం కరీంనగర్‌లోని మైత్రి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. అయితే ఇది ఎన్నికల కోసమే అంటూ కొందరు  పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిం చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల అభివృద్ధిపై దృష్టిసారించారని, అందులో భాగం గానే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళితబంధు ద్వారా 20,982 కుటుంబాలు లబ్ది పొందుతారని తెలిపారు. ఎస్సీల్లో కూడా ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే దళితబంధు అమలు చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. హుజూరాబాద్‌ పాదయాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2003 నుంచి 2021 వరకు ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌ దళితుల అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. దళితులు, రైతులపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీలో ఈటల ఎందుకు చేరారో ప్రజలకు వివరించాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని మోదీ, అమిత్‌షా రాజ్యాంగాన్ని మార్చేం దుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో 20 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, 47 వేల ఓటర్లు ఉన్నారని తెలిపారు. నిజానికి ధర్మపురి, చొప్పదండి కాకుండా హుజూరాబాద్‌ను ఎస్సీ రిజర్వ్‌గా చేయాల్సిన అసవరం ఉందన్నారు. ఈ నెల 23న హుజూరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 28న కూడా హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు సుద్దాల లక్ష్మణ్‌, గజ్జెల ఆనందరావు, గోష్కి శంకర్‌, గసికంటి కుమార్‌, మామిడిపెల్లి కృష్ణ, ఎస్‌కే సుల్తాన్‌, మైసని మనోహర్‌, అనిల్‌కుమార్‌, నవీన్‌, ప్రకాశ్‌, తోడేటి బాబు, తదితరులు పాల్గొన్నారు.    


Updated Date - 2021-07-23T06:44:07+05:30 IST