మైనారిటీ స్వరాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినిపించాలనుకున్నాం

ABN , First Publish Date - 2022-05-02T06:08:12+05:30 IST

మా నాన్న జర్నలిస్టులూ రచయితలతో కూడి సాహిత్య నేపథ్యమున్న కుటుంబంనుంచి వచ్చారు. ఆయన ముత్తాత దాసు శ్రీరాములుగారు. సంగీత నిపుణులు, బహుముఖప్రజ్ఞాశాలి...

మైనారిటీ స్వరాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినిపించాలనుకున్నాం

తామ్రపర్ణి దాసు
tamraparni@gmail.com


మీదీ, నాన్నగారిదీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి?

మా నాన్న జర్నలిస్టులూ రచయితలతో కూడి సాహిత్య నేపథ్యమున్న కుటుంబంనుంచి వచ్చారు. ఆయన ముత్తాత దాసు శ్రీరాములుగారు. సంగీత నిపుణులు, బహుముఖప్రజ్ఞాశాలి. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ‘వాణీ ప్రెస్‌’ మా నాన్న కుటుంబం నెలకొల్పినదే. ఈ ముద్రణా లయం నుంచే స్వాతంత్ర్యోద్యమానికి మద్దతుగా ‘జాగృతి’ పత్రిక వెలువడేది. తొలితరం రచయిత్రి, సమాజ సేవకురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ మా అమ్మకు మేనత్త. అలాగే గత ఏడాది మరణించిన ప్రముఖ చరిత్ర రచయిత పాలపర్తి రామ ప్రసాద్‌ నాకు మేనమామ. ఆ విధంగా మాకు తరాల నుంచీ సాహిత్యంతో అనుబంధం ఉంది.  


ఈ పుస్తకం ఆలోచన ఎలా వచ్చింది. అలెఫ్‌ బుక్‌ కంపెనీ దీన్ని ప్రచురించటానికి ముందుకు ఎలా వచ్చింది?  

అమ్మ 2001లో చనిపోయాక నాన్న నా కుటుం బంతో కలిసి ఉండటానికి అమెరికా వచ్చేశారు. అప్పుడే మా అబ్బాయికి తెలుగు సాహిత్యాన్ని పరి చయం చేయాలన్న ఉద్దేశంతో తెలుగు కథలను అనువదించటం మొదలుపెట్టారు. నాన్న, నేనూ కలిసి తెలుగు రచయితలకు, సమకాలీన తెలుగు కథల అనువాదానికి సహకారం అందించేందుకు ‘ఇండియారైట్స్‌ పబ్లిషర్స్‌’ పేరిట ఒక నాన్‌ ప్రాఫిట్‌ సంస్థను మొదలుపెట్టాం. అలాగే ‘లిటరరీ వాయిసెస్‌’ పేరిట ఆన్‌లైన్‌ మేగజైన్‌ను కూడా కొన్నేళ్లపాటు నడిపాం. తర్వాత తెలుగు కథలకు ఇంగ్లీషు అను వాదాలతో రెండు పుస్తకాలు తీసుకువచ్చాం. అందులో 2010లో రూపా పబ్లికేషన్స్‌ ప్రచురించిన ‘1947 సంతోషబాద్‌ పాసెంజర్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌’ మొదటిది కాగా, ఈ పుస్తకం రెండవది. మొదటి సంపుటిలోని ఒక కథని ఇటీవల ‘ఫ్రంట్‌లైన్‌’ పత్రిక పునర్ముద్రణకోసం అనుమతి అడిగింది. అది ‘అలెఫ్‌’ సంస్థ ఎడిటర్‌తో మా పరిచయానికి దారితీసింది. మేం మొత్తం 25 కథలను వారి ముందుంచాం. వారు వాటిలో 21 కథలు ఎన్నుకున్నారు.   


కథల ఎంపికలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండేట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

మేము మైనారిటీ వర్గాల రచయితలకు ప్రాధా న్యతనిచ్చి వారి స్వరాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినిపించేట్టు చేయాలనుకున్నాం. సామా జిక మార్పుకు దోహదం చేసే రచయితలు, కథలపై ఎక్కువ దృష్టిపెట్టాం--అది స్త్రీలను తెరమరుగు చేసే సంప్రదాయాన్ని ప్రశ్నించిన వేంపల్లె షరీఫ్‌ ‘పర్దా’ కథ కానివ్వండి, దళితుల అభివృద్ధికి ఆటంకాలను చర్చించిన జాజుల గౌరి ‘దస్తకత్‌’ కథ కానివ్వండి. 


మీరూ మీ నాన్నగారు కథలను అనువదించే పనిని ఎలా పంచుకున్నారు?

మేము ఈ సంకలనంలోని కథల ఎంపిక కోసం వందకుపైగా తెలుగు కథలు చదివాం. అనువదించే ముందు ఇద్దరికీ ఆ కథ నచ్చాలి. మొదటి విడత అనువాదాన్ని నాన్న చేస్తారు. తర్వాత నేను తెలుగు మూలం దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతాను. ఇద్దరం ప్రతి ఒక్క పేరా పైన చర్చిస్తాం. తర్వాత నేను ఆ అనువాదాన్ని సవరించి మళ్లీ ఆయనకు ఇస్తాను. ఆయన దాన్ని అంతిమంగా సవరించాక, నేను పలుమార్లు చదివి, మూలానికి దగ్గరగా ఉండేలాగాను, పఠనీయత బాగుండేలాగాను మెరుగుదిద్దుతాను. ఫైనల్‌ కాపీపై ఇద్దరం ఏకాభి ప్రాయానికి వచ్చాక పబ్లిషర్‌కు పంపిస్తాం. 


అనువాదంలో సవాలుగా అనిపించిన కథలే మైనా ఉన్నాయా?

మాండలికంలో రాసిన కథలు గాని (ఉదాహ రణకు మధురాంతకం కథ ‘అజ్ఞాతవాసం’), కవితా త్మక భాషలో రాసిన కథలు గాని (ఉదాహరణకు వేంపల్లి గంగాధర్‌ ‘మొలకల పున్నమి’) ఇంగ్లీషులోకి అనువదించటం చాలా కష్టమైన పని. ముఖ్యంగా కథలోని వాతావరణం, భాషలోని లయ అనువా దంలో రప్పించటం ఒక సవాలు. అలాగే ‘తాయిలం’ లాంటి పదాలు ఇంగ్లీషు చేయటం చాలా కష్టం.


తెలుగులో ఇవే ‘గ్రేటెస్ట్‌ స్టోరీస్‌ ఎవర్‌ టోల్డ్‌’ అని ధ్వనించే విధంగా పేరు పెట్టడానికి కారణం?

ఏ భాషలోనైనా సరే, కేవలం ఇరవై ఒక్క కథలను ఎంపిక చేసి ఇవే ఇప్పటిదాకా వచ్చిన అతిగొప్ప కథలు అనలేం. వంద కథలు తీసుకున్నా ఆ మాట అనలేం. పైగా ఏది మంచి కథ, ఏది కాదూ అనేది పాఠకుడిని బట్టి మారుతుంది. ఈ పబ్లిషర్స్‌ వేర్వేరు భారతీయ భాషల నుంచి అనువదించి చేస్తున్న కథా సంకలనాల సిరీస్‌లో ఇది ఒక భాగం. వారు ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ... ఇలా చాలా భారతీయ భాషల నుంచి ఈ సంకలనాలు వేస్తున్నారు. ఒక్క భాష పేరు మాత్రం మారుతూ అన్నిటికీ ఇదే పేరు ఉంటుంది. ఇది ఎక్కువమంది పాఠకులను ఆకర్షించి వారి చేత ఇతర భాషల కథలను చదివించి ఆ సంస్కృతులపట్ల వారికి అవగాహన కలిగించటానికి మంచి పద్ధతి. 


మీరు ఏర్పాటు చేసిన ‘ఇండియారైట్స్‌ పబ్లిషర్స్‌’ గురించి చెప్పండి?

చాలా సందర్భాల్లో ఇంగ్లీషులో రాసే భారతీయ రచయుతలు మాత్రమే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతున్నారు. వాళ్లు పట్టణ, సంపన్న భారతీయ అనుభవాలనే ఎక్కువగా చిత్రి స్తారు. ఎంతో వైవిధ్యవంతమైన, సంపద్వంతమైన ప్రాంతీయానుభవాన్ని చిత్రించే భారతీయ భాషల రచయితలు అంతర్జాతీయ పాఠకులను చేరలేకపోతు న్నారు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాం. ఈ విష యంలో భారతీయ భాషల రచయితలకు సాయం చేసేందుకు ‘ఇండియారైట్స్‌ పబ్లిషర్స్‌’ అనే మా ఎన్జీవో ద్వారా వారి కథల హక్కులను కొని, డబ్బు చెల్లించి ఇంగ్లీషులోకి అనువదింప చేశాం. తెలుగు అనువాదాలను నేనూ, నాన్నా కలిసి చేశాం.  


భవిష్యత్తులో- మరిన్ని భాషలకు విస్తరించి వీలైనంతమంది యువ రచయితలను ప్రమోట్‌ చేసి, సపోర్ట్‌ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువగా ప్రసిద్ధ, సంప్రదాయ రచనలే అనువాదమవుతు న్నాయి. ఉదాహరణకు- వేమన శతకం, చదువు, వేయిపడగలు... ఇలాంటివి. యాభైఏళ్లలోపు వయ సున్న రచయితల రచనలు చాలా అరుదుగా అనువాదమవుతున్నాయి. ఇందుకు భిన్నంగా మేము వీలైనంతవరకు సమకాలీన అనుభవాలపై, వర్త మాన ధోరణులపై దృష్టిపెడదామనుకుంటున్నాం. 


మీ కథలకు ఇతర భాషల పాఠకుల నుంచి వచ్చిన ప్రశంసల్లో ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా? 

చాలా చోట్ల నుంచి చాలా ప్రశంసలు దక్కాయి. తమిళం, గుజరాతీ, మరాఠీ భాషల పాఠకులు ఇవి చదివి ఇంగ్లీషులో రాసే మెయిన్‌ స్ట్రీమ్‌ భారతీయ రచయితల రచనలతో పోలిస్తే ఇవి ఎంత వైవిధ్యంతో ఉన్నాయోనని ఆశ్యర్యపోయారు. ఇలాగే, అమెరికన్‌ పాఠకులు కూడా ఈ సంకలనంలోని కథల్లోని వైవిధ్యానికి, రిచ్‌నెస్‌కి ఆశ్చర్య పడ్డారు. 


ఇక నా విషయానికి వస్తే- నాన్నతో కలిసి ఈ పని చేయటం నాకు వర్ణించలేని అనుభవం. దీని వల్ల ఆయన నాకు మరింత అర్థమయ్యారు. అలాగే ఈ పనిలో అమ్మ గురించీ, మా కుటుంబం గురించీ, తెలుగు సాహిత్యం గురించీ నేను ఎంతో తెలుసుకున్నాను. 


Updated Date - 2022-05-02T06:08:12+05:30 IST