పాత జీతాలే ఇవ్వండి

ABN , First Publish Date - 2022-01-29T06:47:28+05:30 IST

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు జరిగాయి.

పాత జీతాలే ఇవ్వండి
రిలే దీక్షలో పాల్గొన్న వారికి మద్దతుగా తరలివచ్చిన ఉద్యోగులు

కొనసాగిన రిలే దీక్షలు

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు జరిగాయి. పంచాయతీరాజ్‌, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్‌, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, వెటర్నరీ, ఐటీఐ, పెన్షనర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. డీఈవో కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. సంఘాల నాయకులు అన్వర్‌, సుబ్రమణ్యం, బాలాజీరెడ్డి, నాగరాజు, బాలసుబ్రమణ్యం, మునికృష్ణయ్య, పార్థసారథి, ఇబ్రహీం తదితరులు దీక్షలో పాల్గొన్నారు. గంటా మోహన్‌, రాఘవులు, సుబ్రమణ్యం, అమరనాథ్‌  నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. శనివారం వైద్యఆరోగ్య అనుబంధ శాఖలు, ఆదివారం ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొననున్నారు.

చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు పాత జీతాలే కొత్త డీఏలతో కలిపి ఇవ్వాలంటూ డీడీవోలకు శుక్రవారం వినతిపత్రాలను అందజేశారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు  ఎంఈవోలకు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడికి, మిగిలిన ఉద్యోగులు ఆయా శాఖల డీడీవోలకు ఈ వినతిపత్రాలను అందించారు. కార్వేటినగరం డైట్‌లో పనిచేసే అధ్యాపకులు కూడా నిరసన వ్యక్తం చేసి డీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. తిరుపతి కమిషనర్‌ గిరీషకు పలువురు టీచర్లు వినతి ఇచ్చేందుకు నగరపాలక కార్యాలయానికి వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. శనివారం మళ్లీ వచ్చి ఇస్తామని చెప్పారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయులు కమిషనర్‌ రఘునాథరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. తొలుత ఉపాధ్యాయులు ఎమ్మార్సీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి, అనంతరం ఎంఈవోలకు వినతి పత్రాలిచ్చారు.

దీక్షలకు యంత్రాంగం అడ్డంకులు

 ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమానికి అధికార యంత్రాంగం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారంనుంచి జిల్లా కేంద్రంలో రిలే దీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలుత పాత బస్టాండు, గాంధీ సర్కిల్‌, పీసీఆర్‌ కళాశాల ప్రాంతాల్లో రిలే దీక్షలకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులను కోరగా.. కలెక్టరేట్‌ ఎదుట దీక్షలకు అనుమతిచ్చారు.తీరా తొలిరోజే దీక్ష ప్రారంభించే సమయంలో వద్దని అడ్డుకున్నారు. కట్టమంచి చెరువు పక్కనున్న వివేకానంద విగ్రహం వద్ద పోలీసులు అనుమతివ్వగా.. ఉద్యోగులు రిక్వెస్ట్‌ చేసి జడ్పీ కార్యాలయం ఎదురుగా దీక్షలను ప్రారంభించారు.జడ్పీలో  ఆదివారం స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు ఉండడంతో ఎదురుగా ఉద్యోగులు మైకుల్లో మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుందని జడ్పీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో శని, ఆదివారాలు జడ్పీ ఎదుట కాకుండా వేదికను మార్చాలని పోలీసు అధికారులు శుక్రవారం సాయంత్రం సూచించారు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన సంఘాల నాయకులు రాఘవులు, శివయ్య, సుబ్రమణ్యం, రమణ, పీఎంఆర్‌ ప్రభాకర్‌ శుక్రవారం రాత్రి చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని కలిశారు. కోరినచోట అనుమతివ్వకపోగా, జడ్పీ ఎదురుగా వున్న వేదిక మార్చాలని చెప్పడం దారుణమని డీఎస్పీతో చెప్పుకొచ్చారు. జడ్పీ ఎదురుగా కాకుండా, వేదికను కాస్త అటు ఇటుగా మార్చుకోవాలని డీఎస్పీ సూచించారు. దీనికి అంగీకరించిన సంఘ నేతలు శని, ఆదివారాల్లో దీక్షా వేదికను కాస్త పక్కకు మార్చనున్నారు.

Updated Date - 2022-01-29T06:47:28+05:30 IST