సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం

ABN , First Publish Date - 2021-06-09T05:46:22+05:30 IST

జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల సమష్టి కృషితోనే కరోనా సెకండ్‌వేవ్‌ను కట్టడి చేయగలిగాం.

సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం
కలెక్టర్‌ శరత్‌, కామారెడ్డి

జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు 0.6 శాతానికి పడిపోయింది
ఇంటింటి ఫీవర్‌ సర్వే మంచి ఫలితాలను ఇచ్చింది
రబీలో రికార్డుస్థాయిలో ధాన్యం నిల్వలు వచ్చాయి
సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సిద్ధం చేశాం
త్వరలోనే సీఎం కేసీఆర్‌ పర్యటన ఉండే అవకాశం
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

కామారెడ్డి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల సమష్టి కృషితోనే కరోనా సెకండ్‌వేవ్‌ను కట్టడి చేయగలిగాం. గత పక్షం రోజుల నుం చి జిల్లాలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్‌ రేటు 0.6 శాతానికి పడి పోయింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా బెడ్లు ఖాళీ అయ్యాయి. ఇంటింటి ఫీవర్‌ సర్వే, లాక్‌డౌన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని కలెక్టర్‌ డాక్ట ర్‌ శరత్‌ తెలిపారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్‌ కరోనా కట్టడిపై, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధిహామీ పనులు, సమీకృత నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు సీఎం కేసీఆర్‌ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పలు అం శాలపై ‘ఆంధ్రజ్యోతి’తో చర్చించారు.
ఆంధ్రజ్యోతి: కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతిని ఎలా కట్టడి చేయగలిగారు?
కలెక్టర్‌: జిల్లాలో మార్చి రెండో వారం నుంచి కరోనా పాజిటివ్‌ రేటు పెరుగుతూ వచ్చింది. అప్ప టికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసి అన్ని పీహెచ్‌సీ పరిధిలో కరోనా టెస్టుల సంఖ్య పెంచ డం జరిగింది. ఏప్రిల్‌ మాసంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి మరింత తీవ్రంగా మారింది. జిల్లా లో ప్రతీరోజు వందలకు పైగానే కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాం. ఎక్కడెక్కడ అయితే పాజిటివ్‌ కేసులు ఎక్కువ గా ఉన్నాయో ఆ ప్రాంతాలపై దృష్టి సారించాం. పాజిటివ్‌ వచ్చిన వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌ లో ఉంచడం జరిగింది. జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న సందర్భంలో 25 కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించగలిగాం.
ఆంధ్రజ్యోతి : జిల్లాలో పాజిటివ్‌ శాతం ఎంత వరకు తగ్గింది?
కలెక్టర్‌ : ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు చాలా వరకు తగ్గిపోయింది. గత 15 రోజుల కిందట జిల్లాలో 25 శాతం వరకు పాజిటివ్‌ రేటు ఉండగా ప్రస్తుతం 0.6 శాతానికి పడిపోయింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 1200ల వరకు టెస్టులు చేయగా కేవలం 15లోపే కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.10లక్షల టెస్టులు చేశాం. ఇందులో 10 శా తం వరకే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనగా 30వేల మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తు తం 4,492 మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మొదటివేవ్‌లో 56 మంది మృతి చెందగా, రెండోవేవ్‌లో 79మంది కరోనాతో మృతి చెందారు.
ఆంధ్రజ్యోతి: టెస్టులు, ఆక్సిజన్‌, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏమైనా ఉందా?
కలెక్టర్‌: జిల్లాలో ప్రస్తుతం కరోనా టెస్టులు, ఆక్సిజ న్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో కొవిడ్‌ పేషంట్ల కోసం ఎలాంటి కొరత లేదు. ప్రభుత్వం ఆదేశాల మేర కు జిల్లాలో 29 కేంద్రాల్లో ప్రతీరోజు 1200ల నుంచి 3వేల వరకు పరీక్షలు చేస్తూ వచ్చాం. ప్రభుత్వం తగ్గి ంచమని చెప్పిన సమయంలోనే కాస్తా తగ్గించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచమని ఆదేశించడంతో ప్రతీరోజు 1200 టెస్టులు చేస్తున్నాం. ప్రస్తుతం కరోనా టెస్టుల కిట్ల కొరత ఏమి లేదు. అదేవిధంగా ఏప్రిల్‌, మే నెలల్లో పాజిటివ్‌ రేటు చాలా పెరగడం ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది. అయితే మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేర కు కామారెడ్డి జిల్లా ఆసుపత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులో ఉంచాం. ఇలా జిల్లా లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో 584 ఆక్సి జన్‌ బెడ్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 80శాతం కరోనా బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూశాం.
ఆంధ్రజ్యోతి : ఇంటింటి సర్వే, లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాలను ఇచ్చింది?
కలెక్టర్‌: కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్నందున రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కామారెడ్డి జిల్లాలోనే ఇంటింటి ఫీవర్‌ సర్వేను నిర్వహించడం జరిగిం ది. వైద్యఆరోగ్యశాఖ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, మెప్మా, మున్సిపల్‌ సిబ్బందితో సుమారు 100కు పైగా టీమ్‌లను ఏర్పాటు చేసి ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించాం. జిల్లాలో ఇలా మూడు విడతలు గా సర్వే నిర్వహించగా 9,100పై మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించి వారిని హోం ఐసోలేషన్‌లోనే ఉం చి మెడికల్‌ కిట్లు అందజేయడం జరిగింది. దీంతో కరో నా సెకండ్‌వేవ్‌ను కాస్తా కట్టడి చేయగలిగాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసింది. జిల్లాలో పోలీసు, రెవెన్యూ మున్సిపల్‌ పంచాయతీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో కరోనాను కట్టడి చేయగలిగాం.
ఆంధ్రజ్యోతి: లాక్‌డౌన్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించారు?
కలెక్టర్‌: లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. సడలింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచితంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, కూలీలకు ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పించాం.
ఆంధ్రజ్యోతి:వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగుతోంది?
కలెక్టర్‌: కరోనా నుంచి బయటపడాలంటే ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో కొవ్యాక్సిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నాం. వైద్య సిబ్బంది, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సూపర్‌ స్ర్పెడర్‌లకు వ్యాక్సినేషన్‌ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,82,579 మందికి వ్యాక్సిన్‌ వేశాం. ప్ర స్తుతం జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత ఏమీ లేదు. ప్రస్తుతం పది వేల డోసులు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి: ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయా?
కలెక్టర్‌: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వైపు వైరస్‌ విస్తరిస్తుండడం, మరోవైపు లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ఎక్కడా ఇబ్బందులు పడకుం డా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాం. మరోవైపు అకాల వ ర్షాలతో ధాన్యం తడిసిపోకుండా కేంద్రాల వద్ద ఏర్పా ట్లు చేశాం. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రాని దిగుబడులు రబీలో రికార్డు స్థాయిలోనే ధాన్యం దిగుబడులు వచ్చాయి. ముందస్తు ప్రణాళికతో జిల్లాలో 342 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 88,829 మంది రైతుల నుంచి రూ.841 కోట్లు విలువ చేసే 4.46లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు డబ్బులు చెల్లించడంలోను ఎలాంటి జాప్యం చేయకుం డా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 86వేల రైతుల ఖాతా లో రూ.729కోట్లు జమ చేశాం. జిల్లాలో దాదాపు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.
ఆంధ్రజ్యోతి: సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు పూర్తయితే ఎప్పుడు ప్రారంభిస్తున్నారు?
కలెక్టర్‌: కామారెడ్డి పట్టణ శివారులో సుమారు 30 ఎకరాల్లో నూతన కలెక్టరేట్‌ సమీకృత భవనంతో పా టు క్యాంపు కార్యాలయ నిర్మాణాలు చేపట్టడం జరిగిం ది. ఇందులో ఇప్పటికే క్యాంపు కార్యాలయ నిర్మాణాలు పూర్తవడం ప్రారంభించడం జరిగింది. 28 శాఖలు ఒకే భవనంలో ఉండేవిధంగా సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి నూతన కలెక్టరేట్‌ను సిద్ధంగా ఉంచాం. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సైతం పూర్తి చేశాం. త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లు నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పనుల ఏర్పాట్లను పలు పర్యాయాలుగా పర్యవేక్షించి సమీక్షించారు. త్వరలోనే నూతన కలెక్టరేట్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2021-06-09T05:46:22+05:30 IST