పండుటాకులను కాపాడుకుందాం.!

ABN , First Publish Date - 2020-03-26T08:55:32+05:30 IST

రోనాతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ వైరస్‌ వల్ల వృద్ధులకు ప్రమాదం చాలా ఎక్కువని వైద్యులు...

పండుటాకులను కాపాడుకుందాం.!

  • కరోనాతో వృద్ధులకే ఎక్కువ ప్రమాదం
  • ఆందోళన కలిగిస్తున్న వృద్ధాశ్రమాల పరిస్థితి
  • చాలా ఆశ్రమాలు దాతలపై ఆధారపడ్డవే
  • నిండుకుంటున్న నిత్యావసరాలు
  • లాక్‌డౌన్‌తో ముందుకు రాని దాతలు
  • ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
  • ఏం చేయాలో పాలుపోని నిర్వాహకులు
  • ప్రభుత్వ సాయానికై ఎదురు చూపులు

హైదరాబాద్‌ సిటీ/పద్మారావునగర్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ వైరస్‌ వల్ల వృద్ధులకు ప్రమాదం చాలా ఎక్కువని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చాలా ఆశ్రమాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో లేవు. నిజానికి ఆశ్రమాల నిర్వహణకే డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌తో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో ఆశ్రమాల నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లుగానే ప్రభుత్వం తమకు కూడా నిత్యావసరాలను అందించాలని కోరుతున్నారు.


హైదరాబాద్‌లో సుమారు 250 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 180 ఆశ్రమాలు ఉచితంగా సేవలందిస్తున్నాయి. ఇవన్నీ దాతలపై ఆధారపడ్డవే. వృద్ధులు వైర్‌సను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. దీనికి పోషకాహారం తప్పనిసరి. కానీ,  ఆశ్రమ నిర్వాహకులు మూడు పూటలా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక పోషకాహారం లభించేదెక్కడ? చాలా ఆశ్రమాల్లో నిత్యావసరాలు నిండుకున్నాయి. మార్కెట్‌లో నిత్యావసరాలు, పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆశ్రమాల నిర్వహణ చాలా కష్టమని తెలంగాణ ఓల్డేజ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు నాగచంద్రిక చెబుతున్నారు. పేదలకు ఇచ్చే 12 కేజీల బియ్యం వంటి పథకం ఆశ్రమాల్లోని పేద వృద్ధులకూ అందేలా చూడాలని ఆమె కోరుతున్నారు. విరాళాలను అందించేవారిని పోలీసులు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 


సదా వృద్ధుల సేవలో వలంటీర్లు

హైదరాబాద్‌లో వయోధికుల కోసం ‘యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ వినూత్న సేవలను ప్రారంభించింది. అత్యవసర సమయంలో వృద్ధులకు సహాయంగా ఉండేందుకు కొంతమంది వలంటీర్లు ముందుకొచ్చారు. తమ ఫోను నెంబర్లను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. 


బోయిగూడ వృద్ధాశ్రమం భేష్‌

కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా బోయిగూడలోని వృద్ధాశ్రమంలో అక్కడి సిస్టర్స్‌ అనేక చర్యలు చేపట్టారు. సందర్శకులు, దాతలను రిసెప్షన్‌ వరకే పరిమితం చేశారు. ఆశ్రమ సిబ్బంది సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. వంట కూడా అక్కడి 12 మంది సిస్టర్సే చేస్తున్నారు. 60ఏళ్ల నుంచి 95 ఏళ్ల వయస్సు గలవారు 57 మంది ఇక్కడ ఉంటున్నారు. వీరి యోగ క్షేమాలను కూడా కుటుంబసభ్యులకు ఫోన్ల ద్వారానే తెలియజేస్తున్నారు.


దాతలను పోలీసులు అనుమతించాలి

నేను 18 ఏళ్లుగా వృద్ధాశ్రమం నడుపుతున్నాను. సరుకులు, నిత్యావసరాలు నెలరోజులకు సరిపడా ముందే తెచ్చిపెట్టుకొన్నాను. కానీ మాస్కులు, శానిటైజర్లు దొరకడం లేదు. చాలా వృద్ధాశ్రమాల్లో నిత్యావసరాల కొరత ఉంది.  వృద్ధాశ్రమాలకు విరాళాలందించే దాతలను పోలీసులు అనుమతించాలి. దాతలు కూడా ముందుకురావాలి. ప్రతి హోమ్‌కి మాస్కులు, శానిటైజర్లు అందించాలి. రోడ్డుపై అనాథలుగా ఉన్న వృద్ధులను చేర్చుకోవాల్సిందిగా అధికారుల నుంచే  కాల్స్‌ వస్తున్నాయి. మాకు అభ్యంతరం లేదు.  వారికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించి, తర్వాత హోమ్స్‌లో చేర్చితే మంచిది. పెయిడ్‌ హోమ్స్‌లోని తల్లిదండ్రులను పిల్లలు ఇళ్లకు తీసుకెళ్లడంలేదు. 

  • -నాగచంద్రిక, అధ్యక్షురాలు, 
  • తెలంగాణ ఓల్డేజ్‌హోం అసోసియేషన్‌

Updated Date - 2020-03-26T08:55:32+05:30 IST