పాక్‌తో వర్తకం కోసం మన సరిహద్దులు తెరవాలి: సిద్ధూ

ABN , First Publish Date - 2021-11-20T22:32:41+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాల కారణంగానే కర్తార్‌పూర్..

పాక్‌తో వర్తకం కోసం మన సరిహద్దులు తెరవాలి: సిద్ధూ

ఛండీగఢ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాల కారణంగానే కర్తార్‌పూర్ కేరిడార్ తిరిగి తెరుచుకున్నట్టు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పాక్‌తో వర్తకం కోసం కూడా మన సరిహద్దును తెరవాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు డేరా బాబా నాయక్ (గుర్‌దాస్‌పూర్) వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుకు శనివారంనాడు సిద్ధూ చేరుకున్నారు.


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''పంజాబ్ ప్రజల జీవితాలను మార్చాలని మీరు కోరుకుంటే క్రాస్ బోర్డర్ ట్రేడ్‌ కోసం సరిహద్దులను మనం తెరవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2,100 కిలోమీటర్ల దూరాభారం ఉన్న ముంద్రా పోర్ట్ ద్వారానే మనం ఎందుకు వెళ్లాలి? ఇక్కడి నుంచి వెళ్తే అక్కడికి (పాక్‌కు) కేవలం 21 కిలోమీటర్ల దూరమే'' అని సిద్ధూ అన్నారు. కాగా, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కొద్దికాలం క్రితం మూసివేసిన కర్తార్‌పూర్ క్యారిడార్‌ను ఈనెల 17 నుంచి తిరిగి తెరవాలని మోదీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. వీసారహిత 4.7 కిలోమీటర్ల ఈ క్యారిడార్ భారత సరిహద్దును పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలుపుతుంది. 2019లో ఈ క్యారిడార్ నుంచి రాకపోకలు మొదలయ్యాయి.

Updated Date - 2021-11-20T22:32:41+05:30 IST