మూడేళ్లలో మురిపించాం

ABN , First Publish Date - 2022-08-16T08:45:15+05:30 IST

‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే రాష్ట్ర అభివృద్ధి.

మూడేళ్లలో మురిపించాం


  • స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్‌ స్వోత్కర్ష  
  • ప్రతి పథకంలోనూ శాచురేషన్‌ సాధించాం
  • స్కీమ్‌లతో తెగుతున్న పేదరికం సంకెళ్లు
  • కుటుంబాలను నిలబెట్టేలా ప్రతి పైసా ఖర్చు
  • ప్రజాస్వామ్యానికి అర్థంచెప్పిన ప్రభుత్వం మాదే

అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే రాష్ట్ర అభివృద్ధి. అదే మన స్వాతంత్ర్యానికి అర్థం. ఎన్నికల వరకే రాజకీయాలు. అధికారంలోకి వచ్చాక అంతా మన ప్రజలే అని నమ్మి కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలను చూడకుండా ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్‌ విధానాన్ని అమలు చేశాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాజధాని స్థాయిలో వికేంద్రీకరణే లక్ష్యమని పునరుద్ఘాటించారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఘనంగా నిర్వహించిన 76 స్వాతంత్య్ర వేడుకలకు సతీసమేతంగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో వివిధ సాయుధ దళాల కవాతును పరిశీలించారు. ఆజాదీ కా అమృత్‌ లోగోను ప్రతిబింబిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. 


ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘సంక్షేమ పథకాలను మానవ వనరుల మీద పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, పేదరికం సంకెళ్లను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రజల జీవన, ప్రమాణాలు పెంచే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధించేలా ప్రతి పథకాన్నీ అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు. తెలుగువాడు పింగళి వెంకయ్య తయారుచేసిన జెండా కేవలం దారాల కలనేత కాదు.. 141 కోట్ల భారతీయుల గుండె అని పేర్కొన్నారు. తన మూడేళ్ల పాలనలో ప్రజలందరినీ మురిపించామంటూ జగన్‌ స్వాత్కర్షగా చెప్పారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ‘ఆత్మస్తుతి.. పరనింద’గానే సాగింది. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి ఈ మూడేళ్ల కాలంలోనే 95 శాతం వాగ్దానాలను అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ‘‘ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడప గడపకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాం. 


సమాజంలో వెనుకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి.. వంటి ప్రతి అంశం మీదా సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ మూడేళ్లలో లంచాలు, కమీషన్లు, వివక్ష లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైననవారందరి ఖాతాలకూ రూ. 1.65 లక్షల కోట్లు వెళ్లాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరడం కనీవినీ ఎరుగనిది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ పర్యవేక్షణను మెరుగుపరుస్తూ గ్రామాలు, నగరాలకు అందే పౌర సేవల్లో మార్పులు తీసుకువచ్చాం. 2.7 లక్షల మంది వలంటీర్లు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రతి 2వేల మందికి పౌరసేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్‌లు, ఇంగ్లిష్‌ మీడియం ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్‌ స్కూళ్లు, ప్రతి మండలానికి ఒక 108, ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనాలు, అందులో ఇద్దరు డాక్టర్లు, వారిని విలేజి క్లినిక్‌లతో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, గ్రామాల్లో నిర్మాణం కానున్న డిజిటల్‌ గ్రంథాలయాలు.. ఇవన్నీ కేవలం ఈ మూడేళ్లలోనే తీసుకువచ్చిన మార్పులు’’ అని సీఎం పేర్కొన్నారు.  


పాలనా వికేంద్రీకరణే లక్ష్యం.. 

రాష్ట్రంలో గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలు ఉంటే.. మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించామని సీఎం జగన్‌ అన్నారు. ‘‘రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణే మా విధానం. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యం, పటిష్ట బంధానికి ఇదే పునాది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. వైఎ్‌సఆర్‌ రైతు భరోసాతో 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ. 13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. ఈ-క్రాప్‌ మొదలు ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలతోరైతు సంక్షేమానికి రూ. 83 వేల కోట్లు, ధాన్యం సేకరణకు మరో రూ. 44 వేల కోట్లకు పైగా.. మొత్తంగా ఈ మూడేళ్లలో వ్యవసాయంపై రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-16T08:45:15+05:30 IST