పాపన్న చరిత్రను పరిరక్షిస్తాం..

ABN , First Publish Date - 2022-08-20T06:28:19+05:30 IST

బహుజన రాజ్య స్థాపకుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పరిరక్షించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పాపన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. బహుజన రాజ్యం వస్తుందనే భయంతోనే పాలకులు పాపన్న చరిత్రను బయటకు రాకుండా చేశారన్నారు.

పాపన్న చరిత్రను పరిరక్షిస్తాం..
ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోటలో జరిగిన సభలో మాట్లాడుతున్న బండి సంజయ్‌ చీటకోడూరులో రచ్చబండలో సంచార జాతుల మహిళలతో మాట్లాడుతున్న దృశ్యం..

అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో భారీ విగ్రహం
ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం
ఖిలాషాపూర్‌ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి
సీఎం కేసీఆర్‌ బహుజన ద్రోహి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


జనగామ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : బహుజన రాజ్య స్థాపకుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పరిరక్షించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పాపన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. బహుజన రాజ్యం వస్తుందనే భయంతోనే పాలకులు పాపన్న చరిత్రను బయటకు రాకుండా చేశారన్నారు.

బండి సంజయ్‌ చేపట్టిన మూడోవిడత ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌కు శుక్రవారం రాత్రి చేరుకుంది. ఈ సందర్భంగా సర్ధార్‌ సర్వాయి పాపన్న కోటలో ఏర్పాటు చేసిన పాపన్న జయంతి ఉత్సవసభలో ఆయన మాట్లాడారు. సర్వాయి పాపన్న చరిత్రను పాలకులు మరిచిపోయారని విమర్శించారు. బహుజన రాజ్యం కోసం కొట్లాడి గోల్కొండ కోటను కొల్లగొట్టిన పాపన్న చరిత్రను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. పాపన్న చరిత్ర ఈ తరానికి  తెలిసిస్ఫూర్తి పొందితే బహుజన రాజ్యం వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ నడిబొడ్డున పాపన్న భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఖిలాషాపూర్‌ కోట పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. గౌడ కుల వృత్తిని ప్రోత్సహించడం కోసం ప్రణాళికను రూపొందిస్తామన్నారు. రూ. కోట్ల పెట్టి వందగదులతో ప్రగతి భవన్‌ కట్టుకున్న సీఎం కేసీఆర్‌ పాపన్న కోటను ఎందుకు పునరుద్ధరించట్లేదని ప్రశ్నించారు.

సర్వాయి పాపన్న కోరుకున్న బహుజన రాజ్యానికి విరుద్ధంగా పెద్దోడి రాజ్యం నడుస్తోందన్నారు. మునుగోడులో గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందునే సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారన్నారు. ఇన్ని రోజులు ఈ విష యం ఎందుకు గుర్తుకురాలేదని నిలదీశారు. కేసీఆర్‌ తడిబట్టతో గొంతుకోసే రకమని, గౌడ కులస్థులు ఆయన్ను నమ్మకూడదని సూచించారు.

గౌడ కులవృత్తిని ప్రోత్సహించాల్సిన కేసీఆర్‌ తాటి చెట్లను ఎందుకు నరికివేయిస్తున్నారని ప్రశ్నించారు. వైన్సులు, బెల్టుషాపులను పెంచి కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైన్స్‌లు నడవడం కోసం తాటి వనాల వద్ధ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు ద్వారా కమీషన్‌ రాదనే వైన్స్‌లను ప్రోత్సహిస్తున్నారన్నారు.

సీఎం పాలనలో ఏ మంత్రి కూడా తమ తమ కులాల గురించి మాట్లాడేందుకు ధైర్యం చేయరని బండి సంజయ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహుజనద్రోహి అని విమర్శించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోనే పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాల్లోని పేదలను సైతం పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడంలేదని, ఆరోగ్యశ్రీకి కూడా డబ్బులు ఇవ్వడం లేదని బండి సంజయ్‌ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి నుంచి సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నానని తెలియడంతో చేనేత బీమా పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, ఖిలాషాపూర్‌లోని సర్వాయి పాపన్న కోటకు వస్తున్నానని తెలియడంతో పాపన్న జయంతిని అధికారికంగా జరిపించారని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

బహిరంగ సభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అఽధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్‌ తూళ్ల వీరేందర్‌గౌడ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌, గడీల శ్రీకాంత్‌గౌడ్‌, నందీశ్వర్‌గౌడ్‌,త బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణలో సామాజిక న్యాయం లేదు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

రఘునాథపల్లి, ఆగస్టు 19 : తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం దక్కడంలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఒక్కశాతం కూడా లేని కేసీఆర్‌ సామాజిక వర్గానికే నాలుగు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా  జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్ధార్‌ సర్వాయి పాపన్న కోటలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్‌ మాట్లాడారు. కుటుంబ, ప్రాంతీయ పార్టీలు రూ.వేల కోట్లు దోచుకుంటున్నాయని విమర్శించారు. రూ. కోట్లే వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌజ్‌లు నీట మునిగాయన్నారు. క్లౌడ్‌ బరస్ట్‌ అని కేసీఆర్‌ మాట్లాడారని, కానీ సీఎం కేసీఆర్‌ మెదడే బరస్ట్‌ అయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామన్నారు. ఖిలాషాపూర్‌ కోటను పాపన్న స్మృతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.  తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తేనే మన సంస్కృతి, చరిత్ర వెలుగులోకి వస్తుందన్నారు.  కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నయా నిజాం పాలన నడుస్తోందన్నారు. భూస్వాములు, పెట్టుబడిదారులకు తెలంగాణ సంపదను కేసీఆర్‌ దోచి పెడుతున్నారన్నారు.





Updated Date - 2022-08-20T06:28:19+05:30 IST