Abn logo
Oct 23 2020 @ 00:23AM

కూలిపడేవి కాదు, కాపాడే చెట్లు కావాలి!

సాధారణ దృష్టితో కూడిన హరితహారం కాదు, వాహనాలు కొట్టుకుపోకుండా కాపాడే చెట్లు కావాలిప్పుడు. అందుకు అవసరమైన మొక్కల పెంపు గురించిన దీర్ఘకాలిక ప్రణాళికా రచన నేడు అత్యవసరం. ఇక్కడే ఒక చెట్టును యాదికి చేసుకోవాలి. అది ప్రాణదాత. 1908 మూసీ వరదల సమయంలో వరసగా 36గంటల పాటు కురిసిన సుదీర్ఘ వర్షంలో 1500 వందలమంది మరణించగా, ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న ఈ ఒక్క చింతచెట్టు సుమారు150 మంది ప్రాణాలను కాపాడింది. మళ్ళీ అలాంటి వృక్షాలు ప్రతి కూడలిలో కనపడే రీతిలో నగరాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జరగాలి.


అది 1908 సెప్టెంబరు 28, మంగళవారం. నాటి విలయం ముసురు పడ్డ నగరానికి ఎప్పటికీ ఒక మరపురాని యాది. ఆనాటి వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేశాయి. ఎంతో ప్రాణనష్టాన్నీ కలిగించాయి. ఐతే, అక్కడే నూతన ప్రణాళికకు బీజం పడింది. నిజానికి జంటనగరాల అభివృద్ధి తాలూకు ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ వరదల అనంతరమే అంచెలవారీగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి లోతైన దృష్టితో నగరాన్ని పునర్ నిర్వచించుకొని, జనావాసాల ఆధారంగా జనసంఖ్యను పరిగణనలోకి తీసుకుని, చెట్టూ పుట్టా లెక్కతీయాలి. సరికొత్తగా పునర్ నిర్మాణం జరగాలి. 


సాధారణ దృష్టితో కూడిన హరితహారం కాదు, వాహనాలు కొట్టుకుపోకుండా కాపాడే చెట్లు కావాలిప్పుడు. అందుకు అవసరమైన మొక్కల పెంపు గురించిన దీర్ఘ కాలిక ప్రణాళికా రచన నేడు అత్యవసరం. ఇక్కడే ఒక చెట్టును యాదికి చేసుకోవాలి. అది ప్రాణదాత. 1908మూసీ వరదల సమయంలో వరసగా 36గంటల పాటు కురిసిన సుదీర్ఘ వర్షంలో 1500 వందలమంది మరణించగా, ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న ఈ ఒక్క చింతచెట్టు సుమారు150 మంది ప్రాణాలను కాపాడింది. ప్రభుత్వం ఈ చెట్టుపై తపాలా బిళ్ళను తెచ్చింది. ‘ప్రాణదాత’ అని కూడా నామకరణం చేసింది. హైదరాబాద్ వారసత్వ సంపద గురించి ఎంతో ఆర్తిగా ఆలోచించే కొద్దిమంది ప్రతి ఏడూ ఆ వరదల స్మారకంగా మనుషులను కాపాడిన ఆ చెట్టు వద్ద గుమికూడి ఒక ఆత్మీయ సమావేశం జరుపుకుంటారు. ఇదంతా ఎందుకు గుర్తు చేయడం- అంటే నేడు పట్టణాభివృద్ధిని వరదల ఆధారంగా పునర్ నిర్వచించుకోవాలని. మనిషిని కాపాడిన చెట్లను మళ్ళీ ప్రతి కూడలిలో ప్రతిష్టించుకోవడానికి ప్రతిన బూనాలని. మళ్ళీ అలాంటి బలమైన వృక్షాలు ప్రతి కూడలిలో కనపడే రీతిలో నగరాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జరగాలి. 


మూసీ వరదల అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరదల పునరుక్తిని నివారించడానికి 1909, అక్టోబరు 1న ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే ఏడవ నిజాం 1912లో నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించారు. దాని సూచనలతో 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో హిమాయత్ సాగర్ జలాశయాన్ని నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడానికేగాక నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగ పడ్డాయి. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి, జనాభా పెరుగుదల, పారిశ్రామిక వ్యర్థాలు పోగవడంతో అవన్నీ మెల్లగా వాటి మౌలిక లక్ష్యాలకు దూరం కావడం తెలిసిందే. నేడు వరదలు రాగానే ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకోవడం కాకుండా లోతైన దీర్ఘ కాలిక చర్యలతో పట్టణ ప్రజల జీవితాన్ని శాశ్వతంగా భద్రంగా ఉంచే యోచన చేయవలసి ఉన్నది. దానికి తోడుగా, కొత్తగా కరోనా విలయం నుంచి కూడా ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగవలసి ఉన్నది.


ఇక్కడే... వందేళ్ళ క్రితమే... ఆ చెట్టునే కాదు, నిజాం కాలంలోనే క్యారంటైన్ ఆసుపత్రి నిర్మించడాన్ని మనం యాది చేసుకోవాలి. వ్యాధులు ప్రబలితే వాటిని ఎదుర్కోవడానికి ఆ ఆస్పత్రి కీలక పాత్ర పోషించడం గుర్తెరిగి, అలాంటివి నగరంలో నాలుగు దిక్కులా ఒకటికి పది ఉండటమే కాదు, ప్రజలు వరదల్లో నిరాశ్రయులైనప్పుడు కూడా వాటిలో ఆశ్రయం పొందేందుకు వీలుగా వాటిని నిర్మించాలి. అదే సమయంలో నగర ప్రణాళికకు సంబంధించి, భవన నిర్మాణాల విషయంలో అంతస్తుల పరిగణన ఒక్కటే పరిమితిగా పెట్టకుండా అందులో నివాసం ఉండే జనసంఖ్యతో నిమిత్తం ఉండే ప్రణాళికల రచన అవసరం ఇప్పుడు కీలకంగా ఉండాలి.


కాలనీలోని ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్సులు తదితరాల సౌకర్యాలతో పాటు అక్కడ నివసించే మనుషుల నిష్పత్తిని భాగించాలి. భౌతిక దూరం పాటించడం విషయంలో ఆయా వ్యక్తులు తమ మధ్య పాటించే ఎడం ఒక్కటే లక్ష్యం కారాదు. ఆయా కాలనీల్లో శాశ్వతంగా నివాసం ఉన్న జనసంఖ్య, వారి కోసం ఏర్పాటైన మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులూ అన్నీ కూడా లెక్కతీసి, పరిమిత జన సాంద్రతతో కూడిన కాలనీల విభజన నేడు అతిముఖ్యమైనది. అదే నిజమైన భౌతిక దూరానికి శాశ్వతమైన ఏర్పాటు.  


కరోనా విలయం ఒక ప్రారంభ సూచికే. ఇప్పుడే మనం దూరదృష్టితో కూడిన పట్టణాభివృద్ధి ప్రణాళికలను రచిస్తే అది నగర భవితకు అన్ని విధాలా ఉపకరిస్తుంది. వరదల వంటి విలయాల నుంచి ప్రజలను కాపాడగలుగుతుంది. అదే సమయంలో కరోనా మహమ్మారి అనివార్యంగా డిమాండ్ చేస్తున్న క్వారంటైన్ జీవన విధానాలకు యోగ్యమైన ఉపాయాన్ని స్థిరపరుస్తుంది.


ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, కాంక్రీట్ నగరాలన్నీ మెల్లగా సరికొత్త మార్పులను తమ నిర్మాణంలో ఇముడ్చుకోవాలి. బలంగా వేళ్ళూనుకున్న ఒక వృక్షంలా అవి మారనిదే పెరిగే జనాభాను కాపాడుకోలేవు. అందుకోసం విలయం మనకు ఒక గొప్ప గుణ పాఠం కావాలి. సరికొత్తగా మన లక్ష్యాలను పునర్ నిర్వచించుకొని ముందుకు సాగాలి. లేకపోతే కొట్టుకుపోయే ఇక్కడి నరమానవుడిని ఏ చెట్టూ కాపాడదు.

కందుకూరి రమేష్ బాబు

Advertisement