హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

ABN , First Publish Date - 2021-10-25T05:18:57+05:30 IST

సంస్కృతి సంప్రదాయ విలువలు కలిగిన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని భారతదేశాన్ని కొన్ని దుష్టశక్తులు విచ్ఛిన్నపరచాలనే ఉద్దేశించడంతో ఉన్నాయని అటువంటి శక్తుల ప్రయత్నాలను సాగనివ్వమని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
సభలో మాట్లాడుతున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

బలిదాన్‌ దివస్‌ సభలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఆదిలాబాద్‌, అక్టోబరు24 (ఆంధ్రజ్యోతి): సంస్కృతి సంప్రదాయ విలువలు కలిగిన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని భారతదేశాన్ని కొన్ని దుష్టశక్తులు విచ్ఛిన్నపరచాలనే ఉద్దేశించడంతో ఉన్నాయని అటువంటి శక్తుల ప్రయత్నాలను సాగనివ్వమని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కొమరంభీం బలిదాన్‌ దివస్‌ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న కొమరంభీం, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సభా  ప్రాంగణంలో గోమాతకు  పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని కులమతాల అంతరం చూపి దేశసమతుల్యతను దెబ్బతీయాలని చేస్తున్నారని అటువంటి వారికి హిందూ వాహిని తగిన బుద్ధి చెప్తుందని పేర్కొన్నారు. నిజాం సైన్యంతో విరోచితంగా పోరాడిన గోండు వీరుడు కలలు కన్న జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదాన్ని విస్మరించి కేసీఆర్‌ ప్రభుత్వం  ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి ఆదివాసీల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా కేసీఆర్‌ ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారని ధ్వజమెత్తారు. లవ్‌ జిహాద్‌ పేరిట హిందూ బాలికలను అన్యమతస్థులు వేధింపులకు గురిచేస్తుంటే నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వం మేము ఘర్‌ వాపసి అంటే ఎందుకు చిందులేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. హిందువుల జనాభా తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని జాగ్రత్త పడకపోతే మన హిందువుల భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. సాధువులు పుట్టిన గడ్డ మీద భగత్‌సింగ్‌ లాంటి వీరులు పుట్టారని హిందూ ధర్మ రక్షణ కోసం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రవుమంలో తెలంగాణ సామరస వేదిక అధ్యక్షుడు అప్పాల ప్రసాద్‌, హిందూ వాహిని జాతీయ అధికార ప్రతినిధి కాజల్‌, హిందుస్థాన్‌, తెలంగాణ రాష్ట్ర హిందూ వాహిని మహిళా ప్రముఖ్‌ ధన్యరాధకృష్ణ, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అర్యన్‌ మహరాజ్‌, ఇందూర్‌విభాగ్‌ సహ ప్రముఖ్‌ మందుల విక్కి, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడపనగేష్‌, హిందూ వాహిని మండల అధ్యక్షుడు రాజుతదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:18:57+05:30 IST