ఇరాన్ మహిళ ఆక్రోశానికి మన గొంతూ కలవాలి!

ABN , First Publish Date - 2022-09-30T06:11:39+05:30 IST

కేవలం రెండు వెంట్రుకలు హిజాబ్ నుండి బయటకు వచ్చాయని ఇరాన్‌లోని మతపరమైన మోరల్ పోలీసులు మహ్సా అమిని అనే 22 ఏళ్ళ అమ్మాయిని చిత్ర హింసలకు గురిచేసి...

ఇరాన్ మహిళ ఆక్రోశానికి మన గొంతూ కలవాలి!

కేవలం రెండు వెంట్రుకలు హిజాబ్ నుండి బయటకు వచ్చాయని ఇరాన్‌లోని మతపరమైన మోరల్ పోలీసులు మహ్సా అమిని అనే 22 ఏళ్ళ అమ్మాయిని చిత్ర హింసలకు గురిచేసి పొట్టన బెట్టుకున్నారు. ఆమె లేత చిరునవ్వులు యవ్వనంలోకి అడుగు పెడుతూ కన్న కలలు అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్‌లో మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు అణచివేతలో ఇప్పటికి అధికార అనధికార అంచనాల ప్రకారం 50 మందికి పైగా చనిపోయారు. ఇరాన్‌లో ఇంటర్నెట్‌ను పూర్తిగా కట్ చేసి ఎటువంటి వార్తలు అందకుండా చేస్తున్నారు.


ఈ సమాజం పురోగమించాలంటే– హిజాబ్‌ను కోరుకునే మహిళల కన్నా హిజాబ్‌ను తగలేసే మహిళలు ముఖ్యం. హిజాబ్ కోరుకునే మహిళలు, తమ మత సాంప్రదాయాన్ని తాము అనుసరించాలని అనుకుంటున్నారు. అయితే– హిజాబ్ వద్దనుకునే మహిళలు మత దురాచారానికి, ముఖ్యంగా వ్యవస్థీకృతమైన పురుష నియంతృత్వానికి, వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకే వీళ్ళకు మనం నిర్ద్వంద్వమైన మద్దతు ఇవ్వాలి. మనం వీళ్ళ వెంట నిలవకపోతే– మనుషులు పెంచుకున్న దురాచారాలకు ఏదో ఒక సమ్మతిని వెతుక్కుంటూనే ఉంటాము. ఏ మతంలోనూ ప్రజలు వ్యక్తిగతంగా దుర్మార్గులు కారు. అయితే ఆయా మత విశ్వాసాలలో వ్యవస్థీకృతమైన ద్వేషాన్నీ, దురహంకారాన్నీ గుడ్డిగా విశ్వసిస్తున్నప్పుడే సమస్యలు తలెత్తుతాయి. నిజానికి ఖురాను ప్రకారం కేవలం తల మాత్రం కప్పుకోవాలి (33వ అధ్యాయం, 59వ వాక్యం; 24వ అధ్యాయం 31వ వాక్యం). అరబ్ దేశాలలో మగవాళ్లు కూడా తల కప్పుకుంటారు. అయితే ఈ ఆచారాన్ని మహిళలు ఒళ్ళంతా బుర్ఖా కప్పుకోవాలి అనే విపరీత స్థాయికి తీసుకువెళ్లింది అక్కడి పురుష అహంకార వ్యవస్థ.


గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణాన్ని మనం దిగుమతి చేసుకున్నాము. ప్రపంచవ్యాప్తమైన ఉద్యోగ, ఉపాధులను స్వీకరించాము. ఈ రోజు ఇరాన్ మహిళలపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనను కూడా మనం దిగుమతి చేసుకోవాలి.


అంబేడ్కర్ ఈ బురఖా దురాచారాన్ని తీవ్రంగా నిరసించాడు. దీనిని ఒక “Hideous Sight”గా వర్ణించాడు. అంటే వికారమైన దృశ్యం, అసహ్యమైన దృశ్యం అని అర్థం. ఒక మనిషి అలా ముసుగు వేసుకుని తిరగడం ఒక వికారమైన సాంప్రదాయం అని అంబేడ్కర్ అనడంలో ఖచ్చితమైన గమనిక ఉంది. నిజానికి అంబేడ్కరును కాంగ్రెస్ అణగదొక్కితే ముస్లింల నుంచి సహాయం తీసుకున్నాడు. ముస్లిం లీగ్ నుండి ఎన్నికై తర్వాత మంత్రిగా నియమితుడయ్యాడు. ముస్లింలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని వాదించిన వ్యక్తి ఆయన (నెహ్రూ తనకు అడ్డుపడటం వల్ల ఈ విషయంలో ముందుకు సాగలేకపోయాను అని అంబేడ్కర్ స్వయంగా ప్రకటించాడు). ముస్లిం మైనారిటీల విషయంలో ఎంత మద్దతు ఇచ్చినా, హిజాబ్ పట్ల తన వ్యతిరేకతను మాత్రం నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఆయన సిద్ధాంతం ఆయన విశ్వాసం అలాంటిది. మనుషులను సమర్ధిస్తూ, ప్రేమిస్తూనే, మనుషుల దురలవాట్లను గర్హించడం ఒక్క ఉన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక. మనం ఈ విషయంలో అంబేడ్కర్ నుంచి నేర్చుకోవాలి.


ఇరాన్‌లో ఈ హిజాబ్‌కు వ్యతిరేకంగా కదం తొక్కుతున్న మహిళలపై ప్రభుత్వం పాల్పడుతున్న చిత్రహింసలకు వ్యతిరేకంగా మద్దతు పలకాల్సిన మానవత్వం మనకుండాలి. ఈ భూప్రపంచం మీద ఇటువంటి వికారమైన సాంప్రదాయాన్ని వ్యతిరేకించే ప్రతి మహిళకు, ఏ దేవుడు అడ్డొచ్చినా సరే, కచ్చితంగా సణక్కుండా మన మద్దతు ప్రకటించాలి. మహ్సా అమిని చావు చివరిది అవ్వాలి! స్త్రీల స్వేచ్ఛను నిర్బంధించే ఏ మత దురాచారాన్నయినా ఈ మానవలోకంలో లేకుండా మట్టుబెట్టాలి!


ముస్లిం స్త్రీ తనంతట తానే బుర్ఖా వద్దు అంటున్న ఈ రోజు ప్రపంచమంతా అడుగు ముందుకేసి ఆమెకు అండగా నిలవాలి. మధ్యలో పాశ్చాత్య దేశాలను బూచిలా చూపించి, లేదా ఆ విచ్చలవిడితనాన్ని బూచిలా చూపించి, సందులో సడేమియాలా ఈ దుస్సంప్రదాయాన్ని సమర్థిద్దాం అనుకునే మూఢులు లేకపోలేదు. హిజాబ్ ధరించాలా వద్దా అన్నది మగవాళ్ళ దయాదాక్షిణ్యాల మీద తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. మండుటెండల్లో నిలువునా నల్లటి ముసుగు ధరించడం, ముక్కు నుండి వచ్చే గాలి మళ్ళీ ముఖానికే తగలడం, మంచి బట్టలు వేసుకోకుండా ఎప్పుడూ పైనుండి కిందకు ఒకే వస్త్రాన్ని దిగదీయడం, కళ్ళు మాత్రం బయట పెట్టి ప్రపంచాన్ని చూడ్డం, ఏదన్నా తినాలంటే ముసుగు ఎత్తి నోట్లో పెట్టుకోవడం మళ్ళీ చప్పున ముసుగు దించేసుకోవడం... ఏంటిది వికారం కాకపోతే! ఇలా తిరగడం, ఇలా బతకడం హక్కుగా కావాలి అనుకునేవాళ్ళది వెనుకబాటుతనం కాపోతే ఏమౌతుంది? అయితే– బురఖా ఎంత వెనుకబాటుతనమైనా, చివరికి అదో వస్త్ర సాంప్రదాయమే! ఎవరైనా తాము వేసుకుంటామూ అని పట్టుబడితే, వద్దు అనే హక్కు ఎవరికీ లేదు. మన దేశంలో ఈ మెజారిటేరియనిస్టు మతవాద శక్తులు ప్రమాదకరమైనవి కాబట్టి, ఇవి ప్రతి హక్కునూ కాలరాయడానికి ముందుంటాయి కాబట్టి, హిజాబ్ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అని ముస్లిం మహిళల హక్కును సమర్ధించాల్సిన అవసరం ఉంది. కానీ, నిజానికి ఇంతకంటే వికారమైన ‘సెక్సువలీ కాన్షియస్’ డ్రెస్సింగ్ ఏదీ లేదు.

పి. విక్టర్ విజయ్ కుమార్

Updated Date - 2022-09-30T06:11:39+05:30 IST