24గంటల్లోనే ధాన్యాన్ని తరలిస్తాం

ABN , First Publish Date - 2020-10-27T10:48:30+05:30 IST

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే 24 గంటల్లోనే ధాన్యాన్ని తరలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

24గంటల్లోనే ధాన్యాన్ని తరలిస్తాం

ప్రభుత్వం ప్రతి గింజనూ కొంటుంది

మిల్లర్ల సమస్యలను సీఎం పరిష్కరిస్తారు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 26: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే 24 గంటల్లోనే ధాన్యాన్ని తరలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా వర్షాలు పడి రైతులు పంటలు నష్టపోయాయన్నారు. వర్షాల వల్ల రంగు మారిన ధాన్యాన్ని మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్ముకోకుండా మార్కెట్‌కు తీసుకరావాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వానాకాలంలో పండిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందపి తెలిపారు. రైస్‌ మిల్లర్లకు కొన్ని సమస్యలు ఉన్నవి వాస్తవమేనని, వాటిని సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తారన్నారు. తాలు, తేమ పేరిట రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు.


కొన్ని ఐకేపీ కేంద్రాలు గతంలో చెరువు, కుంటల్లో ఉండేవని, వాటిని ఇతర ప్రాంతాలకు మారుస్తామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, తుమ్మేటి సమ్మిరెడ్డి, గందె శ్రీనివాస్‌, బర్మావత్‌ రమ, ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, గోపు కొమురారెడ్డి, బచ్చు భాస్కర్‌, కళ్లెపు మోహన్‌రావు, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T10:48:30+05:30 IST