గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం

ABN , First Publish Date - 2021-12-05T08:29:01+05:30 IST

నాటి తరం నాయకునిగా, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు.

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం

  • రోశయ్య మృతిపై ఏపీ గవర్నర్‌, 
  • జగన్‌, చంద్రబాబు సంతాపం

 (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నాటి తరం నాయకునిగా, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతిపట్ల గవర్నర్‌తోపాటు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోశయ్య మరణ వార్త తననెంతో బాధించిందని సీఎం జగన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించిన రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరని లోటని పేర్కొన్నారు.   


టీడీపీ కార్యాలయంలో సంతాప సభ

రాజకీయాల్లో నైతిక విలువలు కలిగిన నాయకుడు రోశయ్య అని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో రోశయ్య సంతాప సభ నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రోశయ్య మరణంతో రాష్ట్రం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన యోధుడని, ఏ పదవి చేపట్టినా, ప్రజాసేవకు పాటుపడుతూ, ఆ పదవులకే వన్నె తెచ్చారని ప్రశంసించారు. రాజకీయంగా తమతో విభేదించినా, ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా మెలిగేవారని తెలిపారు.

Updated Date - 2021-12-05T08:29:01+05:30 IST