అంతా మా ఇష్టం...

ABN , First Publish Date - 2022-09-22T06:53:48+05:30 IST

దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్న కాన్సె్‌ప్టను వైఎస్సార్‌ ఉమ్మడి కడప జిల్లాలోని కొందరు ఇసుక సబ్‌ రీచ్‌ నిర్వాహకులు బాగా వంట బట్టించుకున్నారు. ముఖ్య నేతలతో ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రీచ్‌ సమీపంలో ఎక్కడ ఇసుక ఉంటే

అంతా మా ఇష్టం...
తుమ్మలూరులో ఇసుక తవ్వకాలు

డబ్బులు కట్టాం.. ఎక్కడైనా, ఎంతైనా తవ్వుకుంటాం.. 

ఉమ్మడి జిల్లాలో ఇసుక తవ్వకాల తీరిదీ..

 అధికారం మా వాళ్లదే.. మేం ఇసుక సబ్‌ రీచ్‌లను కొనుక్కున్నదే ముఖ్యనేత బంధువుల నుంచి.. వారు చెప్పినట్లు ముందస్తుగానే లెక్క కట్టాం.. పెద్దోళ్లే ఓకే తవ్వుకో అన్నారు.. ఒకరితో మనకేం పనుంది.. కట్టిన డబ్బులు రావాలంటే గడువులోపు తవ్వుకోవాల్సిందే.. అనేలా వ్యవహరిస్తున్నారు కొందరు ఇసుక సబ్‌ రీచ్‌ నిర్వాహకులు.. అనుమతులు ఉన్నచోట కాకుండా యథేచ్ఛగా ఎక్కడపడితే అక్కడ ఇసుకను తవ్వేస్తున్నారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు.. అధికారరాజకీయ బూచిని చూసి భయపడుతున్నారు.


(కడప - ఆంధ్రజ్యోతి): దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్న కాన్సె్‌ప్టను వైఎస్సార్‌ ఉమ్మడి కడప జిల్లాలోని కొందరు ఇసుక సబ్‌ రీచ్‌ నిర్వాహకులు బాగా వంట బట్టించుకున్నారు. ముఖ్య నేతలతో ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రీచ్‌ సమీపంలో ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ తవ్వుకో తవ్వేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా సరే వారికి కావాల్సిన చోట తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఇసుకాసురుల రాజకీయ పలుకుబడిని చూసి చేతులెత్తేశారు. అంతే.. ఎంత తవ్వుకున్నా ఎక్కడ తవ్వేసినా, ఎక్కడికి పంపించినా అడిగే నాధుడే లేడు. అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకువారే లేరు. ఇదీ జిల్లాలో ఇసుక తవ్వకాల పరిస్థితి. జగన్‌ ప్రభుత్వం సృష్టించిన ఇసుక పాలసీ పుణ్యమా అని ఒకప్పుడు ఉచితంగా దొరికే ఇసుక ఇప్పుడు ప్రియం అయింది. ఓ విధంగా బిల్డర్స్‌ మాటలో చెప్పాలంటే ఇసుక బంగారమైంది. దీన్నే సబ్‌ లీజుదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు.


తవ్వుకో సాంబా... !

ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో కొండాపురం, కమలాపురం, చాపాడు, సిద్దవటం, కడప, పెండ్లిమర్రి, వల్లూరు, సిద్దవటం, రాజంపేట, వీరబల్లి మండలాల్లో 14 చోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొన్నటి దాకా జేపీ సంస్థ చేపట్టిన ఇసుక తవ్వకాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మరో సంస్థకు అప్పజెప్పింది. ఆ సంస్థ జిల్లాల వారీగా సబ్‌ లీజులకు అమ్ముకోగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఓ ముఖ్య నేత బంధువులు దక్కించుకున్నట్లు చెబుతారు. సుమారు నెలకు రూ.19 కోట్లు చెల్లించేలా ముఖ్య నేత బంధువులు ఇసుక రీచ్‌దారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే అ ముఖ్యనేత బంధువులు ఉమ్మడి జిల్లాలోని రీచ్‌లను సబ్‌ లీజులకు అమ్మేసినట్లు ప్రచారం ఉంది. ఒక్కో రీచ్‌ను రూ.1.90 కోట్లతో మొదలు రూ.4.50 కోట్లకు అమ్మినట్లు చెబుతారు.


తవ్వుకో.. అమ్ముకో..

ముఖ్య నేత బంధువుల నుంచి ఇసుక రీచ్‌లను సబ్‌ లీజుకు దక్కించుకున్న ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తవ్వకాలకు అనుమతి లేని ప్రాంతాల్లోనే తవ్వుతున్నట్లు ఆరోపణలున్నాయి. పెండ్లిమర్రి మండలంలో తుమ్మలూరు, పొడదుర్తి మధ్య ఇసుక రీచ్‌ల తవ్వకాలకు అనుమతి లేదు. అయితే వేలంలో దక్కించుకున్న సబ్‌ లీజుదారులు ఇక్కడ అడ్డంగా తవ్వేస్తున్నారు. ఈ వి షయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో అధికారులు మంగళవారం దాడులు చేసి వాహనాలను సీజ్‌ చేశారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలను ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల్లోపు జరపాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో నిర్మాణరంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇసుక తవ్వకాలకు సమయం లేదంటూ గతంలో కలెక్టర్‌ ఓ సమావేశంలో వెల్లడించారు. దాన్నే కొందరు సబ్‌ రీచ్‌ ఇసుకాసురులు క్యాష్‌ చేసుకున్నట్లు చెబుతారు. కలెక్టర్‌ చెప్పిన విషయాన్ని తీసుకుని, కొందరు ఇసుకాసురులు రేయిపగలు తేడా లేకుండా అక్రమంగా తవ్వేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఇసుకాసురులకు కేటాయించిన చోట కాకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పెండ్లిమర్రి మండలంలో కేటాయించాల్సిన చోట కాకుండా వేరే చోట ఇసుక తవ్వకాలు జరగడం బట్టబయలైంది. చాలా చోట్ల ఇదే పాలసీని సబ్‌ లీజుదారులు అమలు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. పర్యావరణానికి హాని లేకుండా ఇసుక తవ్వకాలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో తాగు, సాగునీటికి ఇబ్బందులు జరగకూడదు. అయితే పెండ్లిమర్రి మండలంలోని పాపాఘ్నినదిలో జరుగుతున్న అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ముప్పు ఏర్పడుతుందంటూ సర్పంచ్‌ శ్రీనివాసులు గ్రామస్తులతో ఇసుక తవ్వకాలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కేటాయించిన రీచ్‌లలో మీటరు లోపు ఇసుక తవ్వాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా ఇసుకాసురులు మూడునాలుగు మీటర్ల లోతు కూడా తవ్వేస్తున్నారు. 


ఉమ్మడి జిల్లాలో రీచ్‌లు, ఇసుక క్వాంటిటీ (టన్నుల్లో)

------------------------------------------------------

ఇసుక రీచ్‌ హెక్టార్లు క్వాంటిటీ

------------------------------------------------------

వెంకయ్యకాలువ 4620 46200

వీరబల్లె 4987 49870

వెదురూరు 4875 48750

జంగాలపల్లె 4810 48100

ఎస్‌.రాజంపేట 1500 15000

జ్యోతి 3380 33800

కొండూరు 3488 34880

కన్నెలూరు 3000 30000

పొట్టిపాడు 4500 45000

ఆదినిమ్మాయపల్లె, 

చెరువుకిందిపల్లె 12370 123750

కొమ్మలూరు,

త్రిపురవరం 6638 66377

ఏటూరు 2760 27600


నిబంధనల ప్రకారమే తవ్వాలి

- పి.వెంకటకృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌, భూగర్భ గనుల శాఖ 

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వాలి. పర్యావరణానికి హానొ కలిగించే విధంగా తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం సూచించిన చోట మాత్రమే తవ్వకాలు జరపాలి.

Updated Date - 2022-09-22T06:53:48+05:30 IST