కర్ణాటక ఘోర ప్రమాదం నుంచి పాఠాలు నేర్వాల్సిందే..!

ABN , First Publish Date - 2022-06-04T20:42:59+05:30 IST

సరదాగా సాగిపోతున్న విహారయాత్రలు ఒక్కోసారి విషాదంతో ముగుస్తున్నాయి. యాత్రకు వెళ్లిన వారు ఉత్సాహంగా తిరిగి వస్తారని ...

కర్ణాటక ఘోర ప్రమాదం నుంచి పాఠాలు నేర్వాల్సిందే..!

హైదరాబాద్‌ సిటీ : సరదాగా సాగిపోతున్న విహారయాత్రలు ఒక్కోసారి విషాదంతో ముగుస్తున్నాయి. యాత్రకు వెళ్లిన వారు ఉత్సాహంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు సజీవదహనంతో నగరం దిగ్ర్భాంత్రికి గురైంది.డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, పరిమితికి మించి ప్రయాణం, అర్ధరాత్రి డ్రైవింగ్‌.. కారణాలు ఏమైనా ఒక్కోసారి నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. విహార, ఆధ్యాత్మిక, పెళ్లి వేడుకలు విషాద యాత్రలుగా మారిపోతున్నాయి.


నిర్లక్ష్యం.. అతివేగమే..

తాజాగా కర్ణాటకలో జరిగిన ప్రమాదానికి, గతంలో జరిగిన ప్రమాదాలకు నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణాలని తెలుస్తోంది. రాత్రి ప్రయాణాలు, విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడం, హైవేలపై స్పీడ్‌ కంట్రోల్‌ లేకపోవడం లాంటి విషయాల్లో డ్రైవింగ్‌ అనుభవ రాహిత్యం, సరైన అవగాహన లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. ప్రయాణాలు, యాత్రలు చేసే సమయంలో వాహనాలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది.


ఓవర్‌ స్పీడ్‌..

సరిగ్గా రెండు నెలల క్రితం ఏపీ - జగ్గయ్యపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ కారు కల్వర్టును ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. జంగారెడ్డి గూడెంలో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఓవర్‌ స్పీడ్‌తో అదుపు తప్పింది. ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి జోషి సహా నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఐదు నెలల క్రితం.. క్వాలీస్‌ డ్రైవింగ్‌లో జరిగిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. 


చిన్న తప్పిదం..

ఐదు నెలల క్రితం హైదరాబాద్‌, పాతనగరానికి చెందిన రెండు కుటుంబాల సభ్యులు కలిసి మహారాష్ట్ర నాందేడ్‌లోని కాన్‌దార్‌ దర్గాను దర్శించుకుని తిరిగి వస్తుండగా కామారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. తిరుగు ప్రయాణంలో క్వాలిస్‌ వాహనం నడిపే మహ్మద్‌ హుస్సేన్‌ స్నేహితుడైన మహ్మద్‌ ఆమేర్‌కు డ్రైవ్‌ చేయమని ఇచ్చాడు. అనుభవం లేని అతను నడపడమే ప్రమాదానికి కారణమైంది.

Updated Date - 2022-06-04T20:42:59+05:30 IST