Abn logo
Aug 1 2020 @ 00:18AM

మనం మరచిన అంబేడ్కర్ హెచ్చరిక

రాజకీయాల్లో భక్తి, లేక నాయక పూజ పతనానికి, అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే నిశ్చిత మార్గమని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. వ్యక్తిపూజ అనేది ఎప్పుడు ఏ దేశంలో వర్ధిల్లినా అది ఆ దేశానికి వినాశనకరంగా పరిణమించిందన్నది చరిత్ర చాటుతున్న సత్యం. నరేంద్ర మోదీ ఏదో ఒకరోజు ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతారు. మరి దేశ ఆర్థిక వ్యవస్థకు, రాజ్యాంగ సంస్థలకు, జాతి సామాజిక జీవితానికి, నైతిక ప్రాతిపదికలకు మోదీ ఆరాధనతో వాటిల్లిన హాని నుంచి భారత్ ఎప్పటికి కోలుకుంటుంది?


సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ విషయంలో ‘వ్యక్తిపూజ’ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించారు. రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన స్టాలిన్ 1953లో మరణించాడు. మూడు సంవత్సరాల అనంతరం, సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలో నికిటా కృశ్చెవ్ ఒక చరిత్రాత్మక ప్రసంగం వెలువరిస్తూ స్టాలిన్ పట్ల మితిమీరిన వ్యక్తిపూజ పార్టీ పైన, దేశం పైన హానికరమైన ప్రభావాన్ని నెరపిందని అన్నారు. కృశ్చెవ్ ఇంకా ఇలా అన్నారు: ‘ఒక వ్యక్తిని మానవాతీతుడుగా, దైవసమానుడుగా పరిగణించడం మార్క్సిజం-లెనినిజం స్ఫూర్తికి విరుద్ధం’. 


వ్యక్తిపూజ అనే పదం 1956లో మాత్రమే ప్రజల మాటా మంతీలోకి వచ్చినప్పటికీ స్టాలిన్‌కు పూర్వమే వ్యక్తిపూజలు వర్ధిల్లాయి. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో హిట్లర్ మొదలైన వారు మానవాతీతులుగా ప్రజల దృష్టికెక్కేందుకు నవీన ప్రచార పద్ధతులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. సహచరులు, సామాన్య ప్రజల కంటే తాము పూర్తిగా భిన్నమైన వారమని నమ్మించారు. స్టాలిన్ వలే ముస్సోలినీ, హిట్లర్ కూడా అపరిమిత అధికారాలను చెలాయించారు. తమ నిర్ణయాలకు (అవి ఎంత చపలచిత్తమైనవైనప్పటికీ) ప్రతి ఒక్కరూ కట్టుబడివుండేలా చేశారు.


స్టాలిన్‌కు పూర్వం వ్యక్తిపూజలు అందుకున్నవారందరూ పూర్తిగా మితవాద నియంతలే. స్టాలిన్ అనంతరం విపరీత ఆరాధనలందుకున్నవారు అందరూ కాకపోయినప్పటికీ అత్యధికులు వామపక్ష నియంతలే. క్యూబాలో కాస్ట్రో, వియత్నాంలో హోచిమిన్, వెనిజువెలాలో హ్యూగో ఛావెజ్, చైనాలో మావో అపరిమితమైన వ్యక్తిపూజలనందుకున్నారు. ముఖ్యంగా మావో నడయాడుతున్న దైవంగా ఆరాధింపపబడ్డాడు. కోట్లాది ప్రజలు అమిత భక్తిప్రపత్తులతో ఆయనకు మోకరిల్లేవారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట దైవ వాక్కుగా పరిగణించారు.


స్టాలిన్ వ్యక్తిపూజ ఫలితంగా రష్యాకు జరిగిన నష్టం గురించి కృశ్చెవ్ మాట్లాడడానికి ఏడు సంవత్సకాల పూర్వమే డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ భారతీయులకు అసాధారణ వీరారాధన స్వభావం ఉందని పేర్కొన్నారు. మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య రాజ్యాంగం అమలులోకి వస్తున్న సందర్భంగా 1949 నవంబర్ 25న ఆయన రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ఇలా హెచ్చరించారు: ‘సారభూతంగా అప్రజాస్వామికమైన భారతదేశపు నేలలో ప్రజాస్వామ్యమన్నది పై మెరుగు దిద్దడమే అవుతుంది... ఈ దేశంలో భక్తి, లేక నాయకుడి పట్ల అతి గౌరవం చెప్పలేని పరిమాణంలో రాజకీయాల్లో పాత్ర వహిస్తుంది; ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ నాయకత్వ పూజ ఇంతగా రాజకీయాల్లో జోక్యం చేసుకోదు. మత పరంగా భక్తిపరుడైతే అది మోక్ష మార్గమవవచ్చు. ఆత్మకు విముక్తి కలగవచ్చు. అయితే, రాజకీయంలో భక్తి లేక నాయకపూజ పతనానికి, అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే నిశ్చిత మార్గం’. 


1970 దశకం నాటికి డాక్టర్ అంబేడ్కర్ హెచ్చరికలను భారతీయులు పూర్తిగా మరచిపోయారు. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాళ్ళ ముందు సమర్పించారు. ఆమెను పూర్తిగా విశ్వసించారు. ఆమె నాయకత్వాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా అంగీకరించారు. ‘ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వయంగా కీర్తించాడు. అది తన అభిప్రాయం మాత్రమే కాదని, సకల భారతీయుల విశ్వాసమని ఆ మహానుభావుడు నిస్సిగ్గుగా అన్నాడు. అంబేడ్కర్ అన్నట్లు రాజకీయంలో భక్తి లేక నాయకపూజ పతనానికి, అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే నిశ్చిత మార్గం’.


హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, కాస్ట్రో, మావోలు తమ జీవితాంతం అపరిమిత అధికారాలను చెలాయించారు. అయితే ఇందిరాగాంధీ దాదాపు రెండు సంవత్సరాల పాటు నిరంకుశపాలన సాగించి, తాను విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తి వేసి సార్వత్రక ఎన్నికలు నిర్వహించారు. ప్రజలు ఆమెను, ఆమె పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఆమె ధ్వంసం చేసిన రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు క్రమంగా కోలుకున్నాయి. తమ స్వతంత్ర ప్రతిపత్తిని పునః సాధించుకున్నాయి. పత్రికా రంగం మరింతగా స్వేచ్ఛాయుతమయింది. న్యాయవ్యవస్థ మరింత స్వతంత్రంగా వ్యవహరించింది. పౌర సమాజం అభివృద్ధి చెంది వర్థిల్లింది.


అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన రెండు దశాబ్దాలకు నేను నా ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తక రచనకు ఉపక్రమించాను. 2007లో అది ప్రచురితమయ్యేనాటికి భారత్‌ను ఒక ‘50-50 ప్రజాస్వామ్య వ్యవస్థ’గా అభివర్ణించడం సముచితమని నేను భావించాను. ఏడు సంవత్సరాల అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. మన ప్రజాస్వామిక వ్యవస్థ విశ్వసనీయత మళ్ళీ క్షీణించడం ప్రారంభమయింది. పత్రికా స్వేచ్ఛను అణచివేసేందుకు, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, స్వతంత్ర పౌర సమాజ సంస్థలను వేధించేందుకు ఆయన పాలన ప్రయత్నించింది. ఇందిరాగాంధీకి సైతం దాసోహమవ్వని రాజ్యాంగ సంస్థలు ఎన్నికల సంఘం, సైన్యం, రిజర్వ్ బ్యాంక్ మొదలైనవి అంతకంతకూ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించసాగాయి. ప్రధానమంత్రి మాటను ఎటువంటి ఆలోచన లేకుండా అంగీకరిస్తున్నాయి.


రాజ్యాంగ సంస్థల, వ్యవస్థల విధ్వంసానికి పెరుగుతోన్న వ్యక్తి పూజ తోడయింది. 2014 మే నాటి నుంచి ప్రభుత్వ వనరులతో ప్రధానమంత్రికి అపరిమిత ప్రచారం కల్పిస్తున్నారు. మోదీయే భారత్, భారత్ మోదీయే అనేది భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరి వ్యక్త, అవ్యక్త విశ్వాసంగా ఉన్నది. ఇందిరాగాంధీ విషయంలో వలే మోదీ ఆరాధన పెచ్చరిల్లిపోయేందుకు ‘జాతీయ పత్రికా రంగం’ విశేషంగా తోడ్పడుతోంది. ప్రధాని మోదీ సర్వజ్ఞుడు, ఆయన ఎట్టి పరిస్థితులలోనూ పొరపాటు చేయడనే భావాన్ని ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠితం చేసేందుకు భారతీయ మీడియా శత విధాల కృషి చేస్తోంది. 


ఈ వ్యక్తిపూజను మరింతగా పెంపొందించేందుకు కొవిడ్-19 విపత్తు మరో అవకాశాన్ని కల్పించింది. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రసంగాలను వింటున్న, వీక్షిస్తున్న ప్రజల సంఖ్య, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైనల్‌ను వీక్షించిన వారి కంటే చాలా అత్యధికంగా ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యక్తిపూజ మరో రూపాన్నికూడా సంతరించుకున్నది. అదే పిఎమ్ -కేర్స్ అనే కొత్త నిధి. 1948 నుంచి ప్రధానమంత్రి సహాయనిధి అనేది ఒకటి ఉన్నది. కరువు కాటకాలు, భూకంపాలు, తుఫానులు, మహమ్మారులు, యుద్ధం మొదలైన ఆపత్సమయాలలో బాధితులను ఆదుకోదలిచిన వారు ఈ నిధికి విరాళాలు అందించడం జరుగుతోంది. భారత ప్రజలపై కొవిడ్-19 విరుచుకుపడిన తొలినాళ్ళలో ఈ నిధిలో 8000 కోట్ల రూపాయల మేరకు ఈ నిధి వున్నది. ప్రధానమంత్రి సహాయనిధితో పాటు ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది కూడా ఉన్నది. గతంలో వివిధ ఆపత్కాలాలలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ నిధుల ఆసరాతో బాధితులను అన్నివిధాల ఆదుకోవడం జరిగింది. అయితే ప్రధాని మోదీ వాటిని కాదని ఒక కొత్త నిధిని సృష్టించారు. దానికి ‘సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్’ (దీనినే సంక్షిప్తంగా పిఎమ్-కేర్స్ అంటున్నారు) అనిపేరు పెట్టారు. 


నరేంద్రమోదీ ఆరాధన స్టాలిన్ ఆరాధనకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. మూర్తీభవించిన పార్టీగా నాయకుడిని ప్రచారం చేయడం వాటిలో ఒకటి. అలాగే ముస్సోలిని, హిట్లర్ ఆరాధనలనూ అది అనుకరిస్తోంది. ముఖ్యంగా నాయకుని విజ్ఞత అమోఘమైనదని, ఆయన ఎన్నడూ ఎట్టి పరిస్థితులలోనూ తప్పుచేయడని ప్రచారం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో ఈ సాదృశ్యం బాగా కన్పిస్తోంది. అయితే మావో ఆరాధనతోనే మోదీ ఆరాధనకు ఎక్కువ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. డిమానిటైజేషన్ (నోట్ల రద్దు)తో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం మావో ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్’ కార్యక్రమాన్ని గుర్తుకుతెస్తుంది. మావో మాదిరిగానే మోదీ కూడా తన సర్వజ్ఞత్వాన్ని చాటుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. మావో విషయంలో వలే, మోదీ ఆదేశాలను (అర్థం చేసుకోలేకపోయినప్పటికీ) తప్పక పాటించాలని దేశ పౌరులను కోరుతున్నారు. 


ఒక వ్యక్తిని దైవసమానుడుగా పరిగణించడమనేది ‘మార్క్సిజం-–లెనినిజం స్పూర్తికి విరుద్ధమన్న కృశ్చెవ్ మాట నిజమైనా, కాకపోయినా వ్యక్తిపూజ అనేది భారతీయ జనతా పార్టీ చరిత్రకు పూర్తిగా విరుద్ధమైన విషయం. ఒక నాయకుడిని ఆరాధించడాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వస్తోంది. పార్టీ ప్రయోజనాలనే కాక, జాతి ప్రయోజనాలను కూడా నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల ఇష్టాయిష్టాలకు వదిలివేయడం కాంగ్రెస్‌కు పరిపాటి అయిపోయిందన్నది బీజేపీ ఆక్షేపణ. ప్రధానమంత్రిగా వాజపేయి, ఇందిర వలే ఎన్నడూ తన సహచరులపై ఆధిపత్యం నెరపలేదు. వాజపేయిని తమ ‘త్రి మూర్తులు’లో ఒకరుగా మాత్రమే బీజేపీ భావించింది. మిగతా ఇరువురు లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. వాజపేయి వారి ఆలోచనలను, ఆచరణలను గౌరవించేవారు. అయితే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ, దాని పొలిట్ బ్యూరోకు స్టాలిన్ ఎలాంటివాడో ఇప్పుడు బీజేపీ, దాని ప్రభుత్వానికి మోదీ అలాంటివాడుగా పరిణమించారు. అధినేత మాటే అన్నిటా తుది నిర్ణయం. మోదీ ఆరాధన తీరు తెన్నులను గమనిస్తుంటే, హిందూ మత భక్తిభావన భారతీయ ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని అంబేడ్కర్ భయపడడం సబబే అని స్పష్టమవుతుంది. 


వ్యక్తిపూజల చరిత్ర ఒక సత్యాన్ని స్పష్టంచేస్తోంది. వ్యక్తిపూజ అనేది ఎప్పుడు ఏ దేశంలో వర్ధిల్లినా అది ఆ దేశానికి వినాశనకరంగా పరిణమించిందన్నదే ఆ సత్యం. నరేంద్రమోదీ ఏదో ఒకరోజు ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, రాజ్యాంగ సంస్థలకు, జాతి సామాజిక జీవితానికి, నైతిక ప్రాతిపదికలకు మోదీ ఆరాధనతో వాటిల్లిన హానినుంచి భారత్ ఎప్పటికి కోలుకుంటుందో భగవంతుడికే తెలియాలి.రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement
Advertisement