చెన్నై : ‘అమ్మ’ జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు ఏఐఏడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పునరుద్ఘాటించారు. శశికళ ఏఐఏడీఎంకే జెండాను ఆవిష్కరించడం, ఆ కార్యక్రమంలో ఆమెను ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడంపై పళనిస్వామి బుధవారం స్పందించారు.
‘క్షమించడం, మర్చిపోవడం’ అనే వ్యూహాన్ని శశికళ అనుసరిస్తుండటంపై స్పందించాలని మీడియా కోరినపుడు పళనిస్వామి మాట్లాడుతూ, శశికళ తమ పార్టీలో లేరని, ఈ విషయాన్ని తాము అనేకసార్లు చెప్పామని తెలిపారు. ఏఐఏడీఎంకేతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ పార్టీ జెండాను ఉపయోగించినందుకు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆమెకు బోర్ కొట్టి ఇటువంటి పనులు చేస్తున్నట్లుందన్నారు.
శశికళ ఆదివారం ఏఐఏడీఎంకే 50వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆ పార్టీ జెండాను ఎంజీఆర్ హౌస్‌లో ఆవిష్కరించడం ద్వారా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కేడర్‌కు ఓ లేఖ రాశారు. ‘అమ్మ’ జయలలిత వారసత్వాన్ని కాపాడటం కోసం సమైక్యంగా ఉండాలని, కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని శశికళకు అప్పగించేందుకు పన్నీర్‌సెల్వం 2016లో ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్రమాస్తుల కేసులో ఆమె దోషి అని తీర్పు రావడంతో ఆమెను ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించారు. అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామిని శశికళ ఎంపిక చేశారు.