చేతులు కట్టుకొని కూర్చోలేం

ABN , First Publish Date - 2020-06-04T09:23:29+05:30 IST

విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ చేసే పరిధి ట్రైబ్యునల్‌కు లేదని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ చేసిన వాదనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చేతులు కట్టుకొని కూర్చోలేం

  • సుమోటోగా స్వీకరించే అధికారం మాకుంది 
  • ఎల్జీ పాలిమర్స్‌పై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం 
  • సంస్థకు అనుమతిచ్చిన బాధ్యులపై చర్యలకు ఆదేశం
  • పర్యావరణం, బాధితుల పరిహారానికి 50కోట్లు వినియోగం
  • పునరుద్ధరణ ప్రణాళిక, పరిహారం నిర్ణయానికి కమిటీలు 


న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ చేసే పరిధి ట్రైబ్యునల్‌కు లేదని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ చేసిన వాదనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణం నాశనమైన కారణంగా బాధితులకు ఉపశమనం కల్పించడం, పరిహారం ఇప్పించడం, ఆస్తులు, పర్యావరణాన్ని పునరుద్ధరించే అధికారం ఎన్జీటీకి ఉందని తేల్చిచెప్పింది. తమకు విస్తృత అధికారాలున్నాయని, ఈ నేపథ్యంలో సుమోటోగా స్వీకరించే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. జీవించే హక్కుకు తీవ్రఉల్లంఘన, ప్రజారోగ్యానికి నష్టం, ఆస్తుల ధ్వంసం, పర్యావరణ నాశనం అవుతుంటే చేతులు కట్టేసుకొని కూర్చోలేమని వ్యాఖ్యానించింది. పేదలు, దివ్యాంగులు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు బాధితులుగా ఉన్నప్పుడు అలా ఉండలేమని తెలిపింది. గ్యాస్‌ లీకేజీపై సుమోటోగా స్వీకరించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక, దానిపై ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వద్ద ఆ కంపెనీ డిపాజిట్‌ చేసిన రూ.50కోట్లను పర్యావరణం పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని సూచించింది. పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 


ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ప్రతినిధులు ఇద్దరు చొప్పున, జిల్లా కలెక్టర్‌ సహా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ సూచించే ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వివరించింది. రెండు నెలల్లో నివేదిక అందించాలని ఈ కమిటీని ఆదేశించింది. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. బాధితులకు పరిహారం అందించడానికి మరో కమిటీని నియమించింది. దీనిలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎన్‌ఈఈఆర్‌ఐ సంస్థకు చెందిన ప్రతినిఽధులు సభ్యులుగా ఉంటాయని, పరిహారానికి తుది అర్హతలను మదింపు చేయాలని పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి రెండు వారాల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని, అది ఏర్పడిన నాటినుంచి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నడవడానికి అనుమతించిన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై 2నెలల్లో తమకు నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. చట్టబద్ధమైన అనుమతులు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని, పునఃప్రారంభానికి తామే అనుమతి ఇస్తామని ప్రకటించింది. ప్రమాదకరమైన రసాయనాలకు సంబంధించిన సంస్థల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ యంత్రాంగం రూపకల్పనకు మార్గాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖకు సూచించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో 3నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. కాగా, తాము సుమోటోగా తీసుకోవడాన్ని నిరోధిస్తే ఉల్లంఘనల సమస్యలు పరిష్కారం కాకుండా పోతాయనని, పౌరుల జీవించే హక్కు, ఇతర హక్కులు ప్రమాదంలో పడతాయని, పూడ్చలేని, తీవ్రమైన పర్యావరణ నాశనాలు కొనసాగుతాయని ఎన్జీటీ ఘాటుగా వ్యాఖ్యానించింది. 


ప్రమాదం జరగ్గానే పారిపోయారు

ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేసి, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉండగా...కొందరు ఉద్యోగులు బయటకు పారిపోయారని ఎన్‌జీటీ జాయింట్‌ మానిటరింగ్‌ కమిటీ పేర్కొంది. స్టైరిన్‌ ట్యాంకు నుంచి ఆవిర్లు రావడం ప్రారంభమైన వెంటనే తాము పారిపోయామని కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు తెలిపారని పేర్కొంది. అదే సమయంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చెబుతున్న వ్యక్తి మాత్రం మరికొందరితో కలిసి తామంతా స్టైరిన్‌ ట్యాంకులో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు అవసరమైన పారా టెరిటైరీ బుటిలెకేటికాల్‌(పీటీబీసీ) ఉపయోగించామని పేర్కొన్నారని వివరించింది. అయితే ప్లాంటు నుంచి పారిపోయిన వారి మాటలను బట్టి ఏ ఒక్కరూ స్టైరిన్‌ ట్యాంకు వద్దకు వెళ్లలేదని, ఎటువంటి చర్యలు చేపట్టలేదని అర్థమవుతోందని అభిప్రాయపడింది. స్టైరిన్‌ ట్యాంకు నిర్వహణలో యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించింది. ట్యాంక్‌ను చల్లబరచడానికి ఉపయోగించే రిఫ్రిజిరేషన్‌ యూనిట్‌ ప్రమాదానికి ముందు 24 గంటల నుంచి పనిచేయడం లేదని నిర్ధారించింది. స్టైరిన్‌ ఆటో పొలమరైజేషన్‌ను నివారించడానికి ఉపయోగించే పీటీబీసీ నిల్వలు కంపెనీలు తగినన్ని లేవని పేర్కొంది. ఈ ట్యాంకుల నిర్వహణలో మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో చాలామంది ఉద్యోగులున్నా వారిలో ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరినట్టు కమిటీ దృష్టికి రాలేదని పేర్కొంది.

Updated Date - 2020-06-04T09:23:29+05:30 IST