Oct 14 2021 @ 03:45AM

‘మా’కు మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదు!

‘మా’కు పోటీగా తమ కుటుంబానికి మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదని నాగబాబు స్పష్టం చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, ‘మా’ సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సంఘం ‘ఆత్మ’ పెడతారని వార్తలొస్తున్నాయి. వాటిని నాగబాబు ఖండించారు. అలాగే, తాను రాజీనామా చేయడానికి గల కారణాలు వివరిస్తూ... ‘‘తెలుగువారికి ప్రాంతీయవాదం ఉండదనుకున్నా. విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్నా. కానీ, ఎన్నికల తర్వాత ఇటువంటి సంకుచిత మనస్తత్వం ఉన్న అసోషియేషన్‌లో ఉండాలనిపించలేదు. ఇకపై, ‘మా’తో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని చిరంజీవి అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన సాయం చేశారు తప్ప, పెదరాయుడిలా పెద్దరికం చలాయిస్తానని అనలేదని, అటువంటి అహంకారం లేదని నాగబాబు అన్నారు. సాధారణ ఎన్నికల్లో ఎటువంటి కుట్రలు జరుగుతాయో... ‘మా’లోనూ అటువంటివి జరిగాయని ఆయన పేర్కొన్నారు.