AP News: ఓఆర్ 72 శాతం సాధించాం: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు

ABN , First Publish Date - 2022-09-02T03:01:53+05:30 IST

Vijayawada: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు సంస్థ ఆదాయ వ్యయాలను సవివరంగా వివరించారు. కార్గో డోర్ డెలివరీ విధానంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఇకపై ఫుట్ బోర్డు ప్రమాదాల నివారణకు ప్రతీ బస్సుకు ఆటోమెటిక్ నుమాటిక్ డోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పారు.

AP News: ఓఆర్ 72 శాతం సాధించాం: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు

Vijayawada: ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు సంస్థ ఆదాయ వ్యయాలను సవివరంగా వివరించారు. కార్గో డోర్ డెలివరీ విధానంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఇకపై ఫుట్ బోర్డు ప్రమాదాల నివారణకు ప్రతీ బస్సుకు ఆటోమెటిక్ నుమాటిక్ డోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పారు. 


‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఆర్ 72 శాతం సాధించాం. కార్గోలో గతేడాది డోర్ డెలివరీ విధానం అమల్లోకి తెచ్చాం. 154 ప్రాంతాల్లో డోర్ డెలివరీని 50 కిలోలకు పెంచి సక్సెస్ అయ్యాం. లక్షా డెబ్భై వేల డోర్ డెలివరీలు బుక్ అయ్యాయి. కార్గో ద్వారా గత సంవత్సరం రూ. 120 కోట్ల ఆదాయం వచ్చింది. 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచాం. అందులో 800 బస్సులకు టెండర్లు వచ్చాయి. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా టెండర్లు ఉంటేనే తీసుకుంటాం.’’ అని పేర్కొన్నారు.


ప్రమాదాల నివారణకు ఆటోమెటిక్ నుమాటిక్ డోర్స్..

‘‘ఇటీవల ఫుట్ బోర్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు పెరిగాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతీ బస్సుకు ఆటోమెటిక్ నుమాటిక్ ( Automatic pneumatic doors)డోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ బస్సులలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు బాగా ఆదరణ ఉంది. ఆర్టీసీలో కూడా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. 62బస్సులకు టెండర్లు పిలిచాం. తొలివిడతలో 30 బస్సులు ఈ నెలాఖరుకల్లా వస్తాయి. నాన్ ఏసీ స్లీపర్ బస్సులను స్టార్ లైనర్(స్లీప్ ట్రావెల్ అండ్ రిలాక్స్) పేరిట ఈ బస్సులు నడుపుతాం. బస్సుల్లో డిజిటల్ లావాదేవీల కోసం  UTS (యూనిఫైడ్ టికెట్ సొల్యూషన్) విధానం విజయవంతమైంది. టికెట్ బుకింగ్, బస్ పాస్‌లు ,కార్గో తదితర అన్ని సేవలు ఒకే యాప్ కింద తీసుకు వస్తున్నాం. అన్ని బస్సు ల్లో డిజిటల్ లావాదేవీలతో కూడిన ఈపోస్ టిమ్ మిషన్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఈ ఏడాది చివరి నాటికి అన్ని బస్సుల్లో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెడతాం. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ మేరకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. వచ్చే నెలలో ఇస్తాం.’’ అని చెప్పారు.


ఆదాయంలో 25 శాతం ప్రభుత్వానికి

‘‘మాకు నెలకు రూ.600 కోట్లు వరకు ఆదాయం వస్తుంది. వీటిలో 50శాతం ఇంధనానికి, 40శాతం వేతనాలకే సరిపోతుంది. లాభాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుంది. గత నెలలో మాకు రూ. 500 కోట్లు వస్తే రూ. 124కోట్లు ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చాం. ఆర్టీసీకి వచ్చిన ఆదాయంలో 25 శాతం ప్రభుత్వానికి ఇస్తున్నాం . నెలకు  300 కోట్లు వేతనాల కోసం ప్రభుత్వం మాకు ఇస్తోంది. మాకు ఆదాయం పెరిగినపుడు కొత్త బస్సులు కొంటాం. సెప్టెంబర్ 10 నాటికి తొలి ఎలక్ట్రికల్ బస్సు అందుబాటులోకి వస్తుంది.’’ అని తెలిపారు.

Updated Date - 2022-09-02T03:01:53+05:30 IST