మా ఇంట్లో అతని ఛాయాచిత్రముంటుంది

ABN , First Publish Date - 2020-04-13T05:30:00+05:30 IST

బలి అర్పణకు ఇచ్చేది మేకలనేగానీ బలమైన సింహాలను కాదనీ బతికినంతకాలం సింహాల్లానే బతకాలన్న బాబా సాహేబ్‌ మా కళ్ళకి దేవుడులా కనిపిస్తాడు దాక్షిణ్యానికి దేశీయ తీగలు ఎంతకూ సాగనిచోట...

మా ఇంట్లో అతని ఛాయాచిత్రముంటుంది

బలి అర్పణకు 

ఇచ్చేది మేకలనేగానీ బలమైన సింహాలను కాదనీ

బతికినంతకాలం సింహాల్లానే బతకాలన్న 

బాబా సాహేబ్‌ మా కళ్ళకి దేవుడులా కనిపిస్తాడు


దాక్షిణ్యానికి దేశీయ తీగలు ఎంతకూ సాగనిచోట   

అలమటకు అలసటకూ సాంత్వన కలిగించినవాడు 

అలమటిస్తే ఆకలికి రోటీనిచ్చే విద్యనిచ్చినవాడు

కడపటి మనుషులకూ - కడివెడు మంచినీళ్ళకూ 

అంటేమిటన్నవాడెవడైనా దైవంలా కనబడతాడు 


ఏ దేవుడి కార్నివాళ్ళూ కాళ్ళుపెట్టలేని మా వీధుల్లో 

ఏ దేవాదాయమూ తొంగిచూడని ఇరుకు సందుల్లో 

నీలిరంగు విగ్రహాలు ఈఫిల్‌ స్తూపాలౌతాయి   

ఏ కూడికలూ జరగని మా విన్నపాల గదిలో 

‘బోధించు-సమీకరించు-పోరాడ’మనే నినాదాలతో 

నవయానా ముషాయిరాలు గొంతుకలుపుతాయి   


ఏ ఆత్మజ్ఞాన గ్రంథాలూ దొరకని మా ఇంట్లో 

రాజ్యాంగ ఉద్గ్రంథం జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది 

చెడువాసన పోవాలంటే కులం పెంట పోవాలనే 

వాక్యం పదునెక్కుతుంటుంది 


సామాజిక ఎడబాటు ఎంత ఘోరమో 

రోగిష్టి సమాజానికి  చెప్పేదెవడు! 

ఒకడు సత్యంతో ప్రయోగాలు చేశానన్నప్పుడు 

ఈ అభినవ బోధిసత్వుడు సత్యమే మాట్లాడుతూ వచ్చానన్నాడు  

సత్యమే కనబడని సత్యాగ్రహాన్ని నమ్మను పొమ్మన్నాడు 

తనది సత్యకామజాబాలి మార్గమన్నాడు 


మా ఇంట్లో అతని ఛాయాచిత్రముంటుంది

మా హృదయాల్లో ఆత్మల్లో ఆయనుంటాడు 

గోడ ఫ్రేములమీద పొదిగిన ఉల్లేఖనాలై కనబడతాడు

మా పుస్తకాల అలమారల్లో 

మస్తకాల పొరల్లో కొలువుదీరి ఉంటాడు

తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌

95380 53030

(రేపు అంబేద్కర్‌ జయంతి)


Updated Date - 2020-04-13T05:30:00+05:30 IST