Abn logo
Aug 2 2020 @ 02:54AM

మూడు మాకొద్దు

  • బిల్లు ఆమోదం రోజు నుంచే జనంలో వ్యతిరేకత
  • ఇండియా టీవీ సర్వేలో ఆనాడే ‘నో’ చెప్పిన 67% మంది 
  • మూడు రాజధానులు మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం
  • సర్వేలో మంచిదన్నది 29 శాతమే అవిశ్రాంతంగా రాజధాని ఉద్యమం
  • ఇప్పుడు మరింత వ్యతిరేకత!
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
  • వైసీపీ నమ్మించి మోసం చేసింది
  • గవర్నర్‌ది మరణశాసనం: రైతులు
  • రాజధానిలో ఆగిన మహిళా రైతు గుండె


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : దేశంలో 28 రాష్ట్రాలు! ప్రతి రాష్ట్రానికీ ఒక రాజధాని! కానీ... ఆరేళ్ల కిందట సొంత రాజధాని లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు మాత్రం, మూడు రాజధానులు! పాలనకు ఒకటి, న్యాయానికి ఇంకొకటి, చట్ట సభలకు మరొకటి! దీనికి సర్కారు పెద్దలు పెట్టిన పేరు... వికేంద్రీకరణ! ఇదంతా ప్రజల కోసమేనని, వారి అభివృద్ధి కోసమేనని వారు చెబుతున్నారు. కానీ... దేశంలో ఎక్కడాలేని ఈ వింత నిర్ణయాన్ని జనమే తిరస్కరించారు. ఇది ఎంతమాత్రం సరికాదని తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ‘పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లుల’ రద్దును అసెంబ్లీలో ఆమోదించారు. ఆ మరుసటి రోజునే... అంటే జనవరి 21న ‘ఇండియా టీవీ’ చానల్‌ దీనిపై ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించింది. ‘‘జగన్‌ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేస్తోంది. ఈ నిర్ణయం మంచిదేనని భావిస్తున్నారా?’’ అని ప్రశ్నించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67.4 శాతం మంది ‘ఈ ఆలోచన ఎంతమాత్రం మంచిది కాదు’ అని తేల్చిచెప్పారు. 29 శాతం మంది మాత్రం ‘మూడు’కు మద్దతు ఇచ్చారు. ‘దీనిపై ఏమీ చెప్పలేం’ అని కేవలం సుమారు 4 శాతం మంది తెలిపారు. అంటే... అత్యధికులు జగన్‌ సర్కారు నిర్ణయాన్ని విస్పష్టంగా వ్యతిరేకించారు. ఈ సర్వేలో సుమారు 8 వేల మంది పాల్గొన్నారు.


ప్రారంభంలోనే వ్యతిరేకత...

అప్పటికే దాదాపు రూ.పదివేల కోట్లు వెచ్చించి, మరిన్ని వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్న ‘అమరావతి’ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే... ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన మూడు రాజధానుల ప్రకటన చేశారు. అసెంబ్లీలో బిల్లులూ ఆమోదించారు. ప్రారంభంలోనే ఈ ప్రతిపాదనకు మద్దతు లభించకపోవడం గమనార్హం. ఆ తర్వాత రాజధాని రైతుల ఉద్యమం ఉద్ధృతమైంది. పోలీసులు ఉక్కుపాదం మోపినా, లాఠీలతో కొట్టినా, కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. మహిళలు చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నారు. రాజధాని తరలింపు ప్రకటన తర్వాత పేద రైతులు, అందునా పలువురు దళితులు ఎందరో క్షోభతో మరణించారు. ఈ సంఘటనలతో రాజధాని రైతుల కష్టనష్టాలు అన్ని జిల్లాల ప్రజలకు తెలిసివచ్చాయి. అమరావతి కోసం పైసా కూడా తీసుకోకుండా తమ భూములు అప్పగించిన రైతులపై సానుభూతి కూడా పెరిగింది. మూడు రాజధానులపై ఇప్పుడు ప్రజాభిప్రాయం కోరితే మరింత ఎక్కువ వ్యతిరేకత వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.


జాతీయ మీడియా వ్యాఖ్యలు

ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని భావించిన అమరావతి... వైసీపీ సర్కారు నిర్ణయాలతో ఒక సాధారణ రెసిడెన్షియల్‌ కాలనీగా మారుతోందని ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ గతంలో వ్యాఖ్యానించింది. ‘నవరత్నాల’లో భాగంగా అమరావతి భూముల్లో 1251 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించడంపై ఇలా స్పందించింది. ‘‘అమరావతిలో ఇక ఆకాశ హర్మ్యాలు ఉండవు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, స్టార్‌ హోటళ్లు, క్రీడా సముదాయాలు, వివిధ కార్పొరేట్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలు, థీమ్‌ పార్కులు... ఇవేవీ కనిపించవు. వీటికి బదులుగా... పేదల కోసం ఒక్కో సెంటులో నిర్మించిన ఇళ్లతో భారీ కాలనీలు ఏర్పడతాయి’’ అని ఆ పత్రిక పేర్కొంది. ఇక... మూడు రాజధానులకు గవర్నర్‌ ఆమోద ముద్రపడి, నోటిఫికేషన్‌ కూడా జారీ కావడంతో తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతోందని ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ పేర్కొంది. ‘‘త్వరలోనే తరలింపు మొదలవుతుంది. ఇది దశలవారీగా జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో సూచించింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... దసరా నాటికి సచివాలయం సహా అన్ని కార్యాలయాలు విశాఖలో ఉంటాయి’’ అని ఒక అధికారిని ఉటంకిస్తూ హిందూస్థాన్‌ టైమ్స్‌ కథనం రాసింది.

Advertisement
Advertisement
Advertisement