పీఆర్సీ మాకొద్దు

ABN , First Publish Date - 2022-01-19T06:26:17+05:30 IST

రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన 11వ వేతన సవరణ ఉత్తర్వులపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లు భగ్గుమంటున్నారు.

పీఆర్సీ మాకొద్దు
ఒంగోలులో పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు

వేతన సవరణ జీవోలపై ఉద్యోగులు భగ్గు

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

పలుచోట్ల జీవో ప్రతులను దహనం చేసిన ఉపాధ్యాయులు

రేపు కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా

రాష్ట్రసంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌జీవోల కార్యాచరణ

ఒంగోలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన 11వ వేతన సవరణ ఉత్తర్వులపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లు భగ్గుమంటున్నారు. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడంతోపాటు పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, జీవో ప్రతులను దహనం చేసి తమ వ్యతిరేకతను తెలిపారు. గతంలో ఇస్తున్న ఐఆర్‌ 27శాతం కన్నా 4శాతం తగ్గించి 23శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను వారంక్రితం ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఇంటి అద్దె అలవెన్స్‌(హెచ్‌ఆర్‌ఎ) శ్లాబ్‌లలో కోతలు విధించి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. ఫిట్‌మెంట్‌ తగ్గింపుపైనే ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం కాగా జేఏసీ నేతృత్వంలోని ఉద్యోగసంఘాలు మెతకవైఖరిని అవలంబించాయి. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఆందోళనకు పిలుపునిచ్చాయి. తాజాగా హెచ్‌ఆర్‌ఏ కోత విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రస్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్నిరకాల ఉద్యోగుల్లోనూ దీనిపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తమైంది. వివిధ రూపాల్లో  మంగళవారం నిరసనలు చేపట్టారు. ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో పాఠశాలలకు హాజరయ్యారు. సాయంత్రం జిల్లావ్యాప్తంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, వేతన సవరణ జీవో ప్రతులను దహనం చేశారు. ఒంగోలు లాయర్‌పేటలో ఉన్న ఎమ్మార్సీ భవన్‌ వద్ద ఫ్యాప్టో నేతలు సోమసుందరరావు, శ్రీనివాసులు నేతృత్వంలో జీవో ప్రతులను తగులబెట్టారు. స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయం నుంచి ఉపాధ్యాయులు ఎంపీడీవో ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాగా రాష్ట్రస్థాయి ఉద్యోగ జేఏసీ, అమరావతి జేఏసీలు సంయుక్తంగా బుధ, గురువారాల్లో ప్రత్యక్ష కార్యాచరణ ఖరారు చేయనుండగా తదనుగుణంగా జిల్లాలో కార్యక్రమాల నిర్వహణకు ఆయా సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం ఇక్కడి ఎన్‌జీవో భవన్‌లో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు నేతృత్వంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నాసర్‌మస్తాన్‌వలి, వెంకటేశ్వరరావు, మాధవి, షరీఫ్‌ తదితరులు పాల్గొని చర్చించారు. ఇదిలాఉండగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 20న ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా, అలాగే 28న చలో విజయవాడకు భారీగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేసే పనిలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు నిమగ్నమయ్యారు.



Updated Date - 2022-01-19T06:26:17+05:30 IST