మాకొద్దీ తెల్లదొరతనం

ABN , First Publish Date - 2022-08-09T06:54:08+05:30 IST

భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉధృత కెరటంలా మర్చింది సహాయనిరాకరణోత్యమం. దక్షిణాఫ్రికా నుంచి గాంధీ వచ్చాక మొదలైన అహింసా పోరాటంలో తొలి ప్రధాన ఘట్టం ఇది. ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని బ్రిటీష్‌ పాలకులు అరెస్టులు చేశారు. సహాయనిరాకరణ ఉద్యమంలో జైలుపాలైన జిల్లా వాసులు వీరు..

మాకొద్దీ తెల్లదొరతనం

సహాయ నిరాకరణ ఉద్యమంలో  జైళ్లపాలైన జిల్లా సమరయోధులు


సహాయ నిరాకరణ ఉద్యమం

(4.9. 1920 నుంచి 12..2.1922)


భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉధృత కెరటంలా మర్చింది సహాయనిరాకరణోత్యమం. దక్షిణాఫ్రికా నుంచి గాంధీ వచ్చాక మొదలైన అహింసా పోరాటంలో తొలి ప్రధాన ఘట్టం ఇది. రౌలట్‌ చట్టానికీ, 1919 ఏప్రిల్‌ 13న జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోతకూ వ్యతిరేకంగా రగులుతున్న భారతీయ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో భాగం చేశాడు మహాత్ముడు. మనదేశంలో తెల్లపాలనకు దన్నుగా ఉండే అన్ని పనుల నుంచీ భారతీయ ప్రజలు తప్పుకోవాలని పిలుపునిచ్చాడు. మన చేతివృత్తులకు పెను భూతంలా మారిన బ్రిటీషు యంత్ర ఉత్పత్తుల వినియోగాన్ని ఆపేయాలని ప్రజలకుల పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోనూ ఈ ఉద్యమం వేలాదిమందిని కదిలించింది. స్వాతంత్య్ర పోరాటంలోకి నడిపించింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని బ్రిటీష్‌ పాలకులు అరెస్టులు చేశారు. సహాయనిరాకరణ ఉద్యమంలో జైలుపాలైన జిల్లా వాసులు వీరు..

ఎ.వరదాచారి : తిరుపతి నివాసి. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని నెల్లూరు, కడలూరు జైళ్లలో 15నెలలు శిక్ష అనుభవించారు. 

ఎం.సుబ్బారావు : తిరుపతికి చెందిన ఈయన ఏడాది కాలం ఈ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 

నల్లంశెట్టి శ్రీరాములు: తిరుపతికి చెందిన ఈయన కొంత కాలం జైలుశిక్ష అనుభవించారు. విడుదలైన తరువాత కల్లు..సారా దుకాణాలకు వ్యతిరేకంగా పోరాడారు. 

మాడభూషి శ్రీనివాసాచార్యులు: ఇతను తిరుపతి నివాసి. సహాయ నిరాకరణోద్యమంలో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 

బి.మునుస్వామి :. సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 

అనలూరు రంగస్వామి అయ్యంగారు : తిరుమలకు చెందిన ఈయన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని వేలూరు, కడలూరు, మద్రాసు జైళ్లలో సంవత్సర కాలం  పాటు శిక్షను అనుభవించారు. 

సి.వి.రంగన్నశెట్టి : నారాయణపురానికి చెందిన ఈయన ఒక సంవత్సరం పాటు వేలూరు, కడలూరు జైళ్లలో శిక్షను అనుభవించారు. 

కె.బి.రామనాథ్‌ : ఈయన వేలూరు, తిరుచిరాపల్లె జైళ్లలో శిక్ష అనుభవించారు. 

మదార్‌ సాహేబ్‌ : ఈయన తిరుపతిలో వ్యాపారి. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని వేలూరు, కడలూరు జైళ్లలో ఏడాది కాలం పాటు శిక్ష ను అనుభవించారు. 

మాడభూషి అనంత శయనం అయ్యంగారు : తిరుచానూరులో జన్మించిన అనంత శయనం అయ్యంగార్‌ సహాయ నిరాకరణోద్యమం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్‌ఇండియా, ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 

ఎం.సుందరరామయ్య : తిరుపతి నివాసి, వేలూరు, కడలూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. 


 శాసనోల్లంఘన ఉద్యమం

(మార్చి 1930 - 7.4.1934)

‘‘ఒకే ఒక్క కార్యకర్త ప్రాణాలతో మిగిలి ఉన్నా ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీన్ని ఆపడం ఎవరితరం కాదు’’ 

శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ప్రకటన ఇది. భారత ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలు ప్రకటించిన గాంధీ, బ్రిటీషు ప్రభుత్వం లక్ష్యపెట్టకపోతే శాసనోల్లంఘనకు దిగుతామంటూ 1930 జనవరి 31న యంగ్‌ ఇండియా పత్రికలో హెచ్చరించారు. దీనికి అనుగుణంగానే మార్చిలో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. విదేశీ వస్తు బహిష్కరణ, పన్నులు కట్టకుండా నిరాకరణ, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, సారా వేలం పాటల బహిష్కరణ వంటి కార్యక్రమాలు దేశమంతా జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం ఈ ఉద్యమంలో భాగంగానే జరిగింది.   ఉద్యమాన్ని అణచేయడానికి వేలాది మందిని జైళ్లలోకుక్కారు. పోలీసు కాల్పుల్లో వందలాది మంది మరణించారు. రెండు దశలుగా సాగిన ఈ మహోద్యమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు. అరెస్టులు జరిగాయి. ఈ ఉద్యమంలో జైలుపాలైన జిల్లావారిలో కొందరు వీరు...


ఆదికేశవ మొదిలియార్‌ : వ్యవసాయదారుడైన ఈయన చంద్రగిరి నివాసి. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని నాలుగు నెలలు వేలూరు, అలిపురం జైళ్లలో శిక్షను అనుభవించారు. రూ.500జరిమానా చెల్లించారు. 

సి.ఎన్‌.బాలగురునాథగుప్త : వాయల్పాడు నివాసి. వృతి వ్యాపారం ఉప్పు సత్యగ్రాహంలో పాల్గొని ఆరు నెలలు మాద్రాసు, అలిపురం జైళ్లలో శిక్ష అనుభవించారు. 

ఎన్‌.బాలసుబ్బరామదాసు : ఇతని స్వస్థలం శ్రీకాళహస్తి. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని మద్రాసు సెంట్రల్‌ జైలులో మూడు నెలలు శిక్ష అనుభవించారు. 

ఎం.దూర్వాసులునాయుడు: విద్యార్థిగా  శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

టి.కన్నయ్య: శ్రీకాళహస్తి నివాసి అయిన కన్నయ్య ఏడున్నర సంవ్సరాల సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు. 

కేశవ శర్మ : తిరుపతికి చెందిన శర్మ బళ్లారి సెంట్రల్‌ జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

కె.బి. రామనాథ్‌ : వేలూరు, తిరుచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. 

రంగనశెట్టి: నారాయణవనం నివాసి. ఏడాది కాలం పాటు జైలు శిక్ష అనుభవించారు. 

వీరం రామచంద్రారెడ్డి : మదనపల్లె కొత్తపల్లెకు చెందిన రైతు  కుటుంబానికి చెందిన ఈయన చదువుకుంటూనే ఈ ఉద్యమంలో పాల్గొని ఏడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 

బి.ఎ్‌స.శర్మ : చంద్రగిరి నివాసి అయిన శర్మ నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 

ఎల్‌.సౌందరరాజ అయ్యంగార్‌ : లక్ష్మీపురం నివాసి. ఎనిమిది నెలలు బాళ్లారి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. తరువాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని వేలూరు, అమరావతి జైళ్లలో శిక్ష అనుభవించారు. 

విఠల్‌ శ్రీనివాసరావు :  తిరుపతిలో రైతుకుటుంబానికి చెందిన ఈయన వేలూరు, అల్లిపురం జైళ్లలో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

సి.శ్రీనివాసులు శెట్టి : పూతలపట్టు నివాసి. బెంగళూరు, కన్ననూర్‌ జైళ్లలో శిక్ష అనుభవించారు. 

ఎన్‌.సౌందర్యరాజన్‌ : లక్ష్మీపురం నివాసి. రైతు. వేలూరు, తిరుచిరాపల్లి జైళ్లలో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. 

ఎ.పి.వజ్రవేలు శెట్టి : కుప్పం నివాసి అయిన ఈయన వేలూరులో ఇంటర్‌ చదువుతుండగా గాంధీ అరె్‌స్టుకు నిరసనగా సమ్మె చేశారు. ఫలితంగా ఇతనిని కళాశాల నుంచి తొలగించారు. 


ఉప్పుసత్యాగ్రహంలో


కుండితిమడుగు మల్‌రెడ్డి : మదనపల్లె తాలూకా చోడసముద్రం నివాసి. విద్యార్ధిగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం రాజమండ్రి, బరంపురం జైళ్లలో శిక్షను అనుభవించారు. రూ. 200జరిమానా చెల్లించారు. 

కుడితిపూడి పుండరీకాక్షయ్య : తిరుపతికి చెందిన రైతు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 9నెలలు రాజమండ్రి, వేలూరు, బళ్లారి జైళ్లలో శిక్ష అనుభవించారు. 

టి.రామచంద్రరావు : మదనపల్లెకు చెందిన ఇతను ఉప్పు సత్యాగ్రహం కాలంలో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 

రాపూరు గోవిందస్వామి నాయుడు : పుత్తూరు సమీపంలోని పరమేశ్వరమంగళానికి చెందిన రైతు ఈయన. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. 

కలిసి శ్రీరామరెడ్డి : వాయల్పాడుకు చెందిన రైతు. ఉప్పు సత్యాగ్రహంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు.

డి.ఎన్‌.వల్లభరావు: మదనపల్లె నివాసి. వేలూరు జైలులో నెల రోజులు శిక్ష అనుభవించారు. 

ఎన్‌.ఎ్‌స.వరదాచారి: తిరుపతి నివాసి. ఆరు నెలలు తిరుచిరాపల్లె, కడలూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. 

ఎ.వెంకటేశయ్య : చిత్తూరు నివాసి. 13నెలలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. 


తెగిన సంకెళ్లకు సాక్షి


సుదీర్ఘ పోరాట ఫలితం దక్కిన వేళ దేశమంతా సబంరాలు అంబరాన్ని అంటాయి. ఆ సంతోష సమయాన్ని భావి తరాలకు గుర్తుండేలా చేయాలని రామకుప్పం మండలం బందార్లపల్లెకు చెందిన దొడ్డేగౌడ భావించారు. ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.  స్వాతంత్య్ర సిద్ధతా స్థూపాన్ని గ్రామంలో నిర్మించి అందరినీ పోగేసి వేడుకలు నిర్వహించారు.  స్తూపం కింది భాగంలో నల్లరాతిపై ‘ఓం, శ్రీవందేమాతరం, జైహింద్‌ స్వాతంత్య్ర సిద్ధతా భారత మహాదేశం’ అని రాసి ఉంటుంది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి భారతీయులకు స్వాతంత్య్రం అప్పగించి బ్రిటీష్‌ వారు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారని లిఖించారు.  75 ఏళ్ళుగా ఈ స్తూపం చెక్కుచెదరకుండా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేస్తోంది.



Updated Date - 2022-08-09T06:54:08+05:30 IST